తెలుగు వ్యక్తికి ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అవార్డు

తెలుగు వ్యక్తికి ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అవార్డు


చెన్నుపాటి జగదీశ్‌కు అరుదైన గౌరవం  

మరో ఇద్దరు ప్రవాసులకు కూడా..


 

 మెల్‌బోర్న్: ముగ్గురు ప్రవాస భారతీయులకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ దక్కింది. వివిధ రంగాల్లో వీరు కనబరిచిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా మొత్తం 600 మంది సమాజ సేవకులకు పురస్కారాలు దక్కగా అందులో మన వాళ్లు ముగ్గురు ఉండటం విశేషం. కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియా నేషనల్ వర్సిటీ (ఏఎన్‌యూ)లో పనిచేస్తున్న  తెలుగు వ్యక్తి ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్, సౌత్‌వేల్స్‌లో నేత్రవైద్య నిపుణుడిగా పని చేస్తున్న జయచంద్ర, మెల్‌బోర్న్‌లో దంతవైద్యుడిగా సేవలందిస్తున్న సజీవ్ కోషీలను ఆస్ట్రేలియా ప్రభుత్వం 2016కు గాను ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాలకు ఎంపిక చేసింది.



 అసమాన ప్రతిభ.. ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ నాగార్జున వర్సిటీలో గ్రాడ్యుయేషన్, 1977లో ఆంధ్రా వర్సిటీలో ఎమ్మెస్సీ (టెక్నాలజీ) పూర్తి చేశారు. ఢిల్లీ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ సంపాదించిన ఈయన.. ఆ తర్వాత కెనడాలోని కింగ్‌స్టన్ వర్సిటీలో రీసెర్చ్ అసోసియేట్‌గా ఉన్నారు. 1990లో ఆస్ట్రేలియా వెళ్లిన జగదీశ్ ఆప్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలో పరిశోధన ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలకు సలహాదారుగా, పరిశోధకుడిగా, రచయితగా ఈయన అవిరళ కృషిని గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. పాతికేళ్లకు పైగా సేవలందించినందుకుగానూ తనకు దక్కిన అరుదైన గౌరవమిదని జగదీశ్ పేర్కొన్నారు.



 అవార్డుపై జయచంద్ర ‘నేత్రం’

 జయచంద్ర వెస్ట్‌మేడ్ ఆస్పత్రి ప్రారంభించినప్పటినుంచి (1985) వెట్రియో రెటీనల్ శస్త్రచికిత్సల నిపుణుడిగా సేవలందిస్తున్నారు. నేత్రవైద్య రంగంలో అసమాన సేవలందించినందుకు, అంతర్జాతీయ స్థాయిలో నేత్ర పరిరక్షణ సంబంధిత కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నందుకు జయచంద్రకు ఈ పురస్కారం దక్కింది. తాను ఈ అవార్డుకు అర్హుడిననుకోవటం లేదని.. అయితే తనను గుర్తించినందుకు సంతోషంగా ఉందని జయచంద్ర తెలిపారు. దీంతోపాటు, దంతవైద్యంలో అందించిన సేవలకు గుర్తింపుగా.. డాక్టర్ సజీవ్ కోషీకి కూడా ఆస్ట్రేలియా అత్యున్నత పౌరపురస్కారం దక్కింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top