
ప్రధాని మోదీకి బాసటగా నిలిచిన భార్య
పాత పెద్ద నోట్ల చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది విమర్శిస్తున్నప్పటికీ ఆయన సతీమణి జశోదాబెన్ మాత్రం సమర్థించారు.
ఉదయ్‌పూర్: పాత పెద్ద నోట్ల చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది విమర్శిస్తున్నప్పటికీ ఆయన సతీమణి జశోదాబెన్ మాత్రం సమర్థించారు. నల్లధనం వెలికితీయడానికి డీమోనిటైజేషన్ ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయురాలిగా రిటైరైన 64 ఏళ్ల జశోదాబెన్ బుధవారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఒక ప్రైవేటు స్కూల్ స్వర్ణోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీజీ తీసుకున్న నిర్ణయం సరైనదే. పాత రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడంతో దేశంలోని నల్లధనం బహిర్గతమవుతుంద’ని పేర్కొన్నారు. ‘వందేమాతరం’ తో ప్రసంగం ప్రారంభించిన జశోదాబెన్.. మహిళలు స్వశక్తితో రాణించాలని అన్నారు. సుష్మాస్వరాజ్, మాయావతి, ఇందిరాగాంధీలా మహిళలు ఆయా రంగాల్లో దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో పేద కుటుంబాల్లోని మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. చాలా మంది స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవడంతో దారిద్ర్యరేఖ దిగువనున్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం సాధ్యమయిందని వివరించారు.