వైద్యరంగంలోనే ఓ అద్భుతం ఆ బాలుడు | Mother ends locked-in boy's long silence | Sakshi
Sakshi News home page

వైద్యరంగంలోనే ఓ అద్భుతం ఆ బాలుడు

Jul 4 2016 5:41 PM | Updated on Sep 4 2017 4:07 AM

వైద్యరంగంలోనే ఓ అద్భుతం ఆ బాలుడు

వైద్యరంగంలోనే ఓ అద్భుతం ఆ బాలుడు

సెరిబ్రెల్ పాల్‌జీ (మస్తిష్క పక్షవాతం)తో బాధపడుతున్న జొనాథన్ బ్య్రాన్ ఏడేళ్ల వరకు నరకం అనుభవించాడు.

లండన్: సెరిబ్రెల్ పాల్‌జీ (మస్తిష్క పక్షవాతం)తో బాధపడుతున్న జొనాథన్ బ్య్రాన్ ఏడేళ్ల వరకు నరకం అనుభవించాడు. శరీరంలోని ఏ అవయవం కదిలేది కాదు. కాళ్లు చేతులే కాకుండా ముఖాన నవ్వుకూడా విరిసేది కాదు. కనురెప్పలు మిటకరించడం తప్ప ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయడం సాధ్యమయ్యేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో జొనాథన్‌కు వైద్యం కొనసాగించేందుకు కూడా వైద్యులు నిరాకరించారు. వైద్యం ఆపేసి ప్రశాంతంగా కన్నుమూసేందుకు అవకాశం ఇద్దామని కూడా వైద్యులు సలహాలు ఇచ్చారు. అంగవికలుర పాఠశాలలో చేర్చుకునేందుకు కూడా పాఠశాలల యజమానులు నిరాకరించారు. 
 
కన్నపేగు తీపేమిటో కన్నతల్లైన చంతన్‌కే తెలుసు. ఆమె ఈ సలహాలేవీ వినేందుకు సుముఖంగా లేదు. ఎందుకు తన బాబుకు మాట్లాడడం రాదు, ఎందుకు కాలు, చేయి కదపడం రాదు, ఎందుకు అందరిలా ఎదగలేడు? అన్న విషయాన్ని పదే పదే ఆలోచించారు. ఎలాగైనా తన బాబుకు మాటలు నేర్పించాలని, నడవడం నేర్పించాలని భావించారు. ఓ రోజు మార్కెట్‌కు వెళ్లి ‘పర్స్‌పెక్స్ స్పెల్లింగ్ బోర్డు’ను కొని తెచ్చారు. ఓపిగ్గా ఇంగ్లీషు ఓనమాలు నేర్పడం ప్రారంభించారు. కొంతకాలం పాటు కళ్లు మిటకరి చూడడం తప్ప జొనాథన్ ఏమీ చేయలేకపోయాడు. అయినా పట్టువదలని విక్రమార్కునిలా చంతన్ అకుంఠిత దీక్షతో కొడుక్కి ఓనమాలు నేర్పడానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. కొన్ని రోజులకు జొనాథన్ పెదాలు కదపడం మొదలుపెట్టాడు. తల్లిలో కొత్త ఆశ చిగురించింది. ప్రతి ఉదయం ఒకటి, రెండు పదాలు జొనాథన్‌కు ఒంటబడుతూ వచ్చాయి. అలా నెలలు గడిచిపోయాయి. ఓ ఆరు నెలల్లో ఒనమాలు పలకడం, రాయడం జొనాథన్ నేర్చుకున్నాడు. పెదాలు పలకడంతో వచ్చిన ఉత్సాహంతో జొనాతన్ మెల్లగా కాళ్లు, చేతులు కలపడం ప్రారంభించాడు. 
 
ఇప్పుడు జొనాథన్‌కు తొమ్మిదిన్నర ఏళ్లు. ఆ బాలుడు ఇప్పుడు రాయడం, చదవడమే కాదు. పాఠశాలకు కూడా వెళుతున్నాడు. లెక్కల్లో క్లాస్‌లోనే ఫస్ట్. వ్యాసాలు, కథలు రాయడం కూడా ప్రారంభించాడు. ఇటీవల బీబీసీ నిర్వహించిన ఓ పోటీకి వ్యాసాన్ని కూడా రాశాడు. తన ఆత్మకథ రాసుకున్నాడు. ‘ఐకాంట్‌టాక్ (కన్ను మాట్లాడలేదు) అనే బ్లాగ్‌ను కూడా నడుపుతున్నాడు. జొనాథన్‌లో వచ్చిన అద్భుతమైన మార్పును చూసి వైద్యులే ముక్కున వేలేసుకుంటున్నారు. తల్లి, కొడుకు చూపిన అకుంఠిత దీక్ష వల్లనే ఇది సాధ్యమైందని వైద్యులు భావిస్తున్నారు. వైద్య చరిత్రలోనే బాబు ఇలా కోలుకోవడం అనేది ఓ అధ్యాయమని వారు భావిస్తున్నారు.
 
అయినా ఇప్పటికీ బాలుడి మెదడుకు కావాల్సిన ఆక్సిజన్‌ను కృత్రిమంగా అందించాల్సి వస్తోంది. ఆ బాలుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగిన కారు యాక్సిడెంట్ కారణంగా బాలుడి మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయింది. అందుకనే ఆయన ‘సెరిబ్రెల్ పాల్‌జీ’ వ్యాధిన పడ్డాడు. ఇలాంటి పిల్లలకు మాట్లాడే అవకాశాలు ఎప్పటికీ ఉండవు. బ్రిటన్‌లో ప్రస్తుతం 30వేల మంది పిల్లలు ఈ జబ్బుతో బాధపడుతున్నారు. జొనాథన్ పురోగతి గురించి తెల్సిన మీడియా ఇటీవల విల్ట్‌షైర్‌లోని జొనాథన్ ఇంటికి వెళ్లి బాలుడిని పలుకరించింది.
 
బ్రిటన్‌లో ఇటీవల నిర్వహించిన ‘బ్రెగ్జిట్’ గురించి ఆ బాలుడిని ప్రశ్నించగా, ఇది మనమంతా కలసి ఉండాల్సిన సమయం అంటూ జొనాథన్ ఎంతో పరిణతితో చెప్పాడు. పెద్దయ్యాక ఏమవుతావని ప్రశ్నించగా, జీసస్ గార్డెన్‌కు వెళతానని చెప్పాడు. జొనాతన్‌కు తల్లి చంతన్‌తో తండ్రి క్రిస్టఫర్, ఒక అక్క, ఓ చెల్లెలు ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement