
'విభజన ముగిసింది, పైరవీలు మొదలు'
రాష్ట్ర విభజన ఘట్టం ముగిసింది. ఇక నేతల పైరవీలు మొదలయ్యాయి.
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ఘట్టం ముగిసింది. ఇక నేతల పైరవీలు మొదలయ్యాయి. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలుస్తున్నారు. అందులో భాగంగా మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం సోనియాతో భేటీ అయ్యారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ....అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధింపుపై కాంగ్రెస్ అధిష్టానం విముఖంగా ఉంది. వీలైతే రెండు ప్రభుత్వాలను, లేదంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా యోచిస్తోంది. ముఖ్యమంత్రి రాజీనామాతో తలెత్తిన పరిస్థితులు, విభజనకు సంబంధించి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్, అపాయింటెడ్ డే వంటి కీలకాంశాలను తేల్చాల్సి ఉన్నందున రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సోనియాతో కన్నా, ఉత్తమ్ల భేటీ హాట్ టాఫిక్గా మారింది. కిరణ్ స్థానంలో కన్నా లక్ష్మీనారాయణ ఎంపిక జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక గవర్నర్ నివేదిక మేరకు రాష్ట్రపతి పాలన విధించాలా, అపాయింటెడ్ డే నిర్ణయమయ్యేదాకా అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన కొనసాగించడమా, సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచే ప్రయత్నాల్లో భాగంగా విభజన ప్రక్రియ పూర్తయ్యేదాకా ఆ ప్రాంతానికి చెందిన మరో నేతను సీఎం చేయడమా అనేదానిపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది.