వాణిజ్య విమానానికి వందేళ్లు! | IATA celebrates 100 years of commercial aviation | Sakshi
Sakshi News home page

వాణిజ్య విమానానికి వందేళ్లు!

Jan 1 2014 12:57 AM | Updated on Sep 2 2017 2:09 AM

వాణిజ్య విమానానికి వందేళ్లు!

వాణిజ్య విమానానికి వందేళ్లు!

రైట్ సోదరులు 1903లోనే విమానాన్ని ఆవిష్కరించినా.. వాణిజ్యపరంగా సేవలు ప్రారం భం కావడానికి మరో దశాబ్దం పట్టింది. నలుగురు ఔత్సాహికులు వీటికి పునాది వేశారు.

న్యూఢిల్లీ: రైట్ సోదరులు 1903లోనే విమానాన్ని ఆవిష్కరించినా.. వాణిజ్యపరంగా సేవలు ప్రారం భం కావడానికి మరో దశాబ్దం పట్టింది. నలుగురు ఔత్సాహికులు వీటికి పునాది వేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్-తంపా ఎయిర్‌బోట్ లైన్ సంస్థ ఏర్పాటు ద్వారా పెర్సివల్ ఫాన్స్‌లర్, థామస్ బెనోయి.. 1914 జనవరి 1న తొలి సర్వీసును ప్రారంభించారు. మొదటి ఫ్లయిట్‌కి టోనీ జానస్ పైలట్‌గా సారథ్యం వహించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో తంపా బే-సెయింట్ పీటర్స్‌బర్గ్ మధ్య నీటి మీదుగా తొలి విమానం ఎగిరింది. ఇందులో ప్రయాణించేందుకు తొలి టికెట్‌ను వేలం వేయగా.. సెయింట్ పీటర్స్‌బర్గ్ మేయర్ అబ్రమ్ ఫెల్ 400 డాలర్లు చెల్లించి దక్కించుకున్నారు. దాదాపు 21 మైళ్ల దూరం సాగిన ప్రయాణానికి సుమారు 23 నిమిషాలు పట్టింది. ఇలా ప్రారంభమైన విమాన సర్వీసులు..అప్పట్నుంచీ వేల మైళ్ల దూరాలకు ప్రయాణికులను చేరవేస్తూనే ఉన్నాయి.  విమానాలు కూడా అనేక మార్పులకు లోనై.. ఆధునిక రూపు సంతరించుకున్నాయి.
 
 కోట్ల మందికి ఉపాధి..
 ఒక్క ప్రయాణికుడితో మొదలైన విమాన సర్వీసులు ప్రస్తుతం భారీస్థాయిలో విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 80 లక్షల మంది ఏరోప్లేన్లలో ప్రయాణిస్తున్నారు. 2013లో మొత్తం ప్రయాణికుల సంఖ్య తొలిసారిగా 300 కోట్ల మార్కు అధిగమించి 310 కోట్లకు చేరింది. ఈ సంఖ్య 2014లో 330 కోట్లకు చేరొచ్చని అంచనా. ఇది ప్రపంచ జనాభాలో దాదాపు 44 శాతం. ఇక, సరుకు రవాణా విషయానికొస్తే.. ఏటా 5 కోట్ల పైచిలుకు టన్నుల సరుకులను విమానాలు రవాణా చేస్తున్నాయి. వీటి వార్షిక విలువ దాదాపు 6.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుంది. అంతర్జాతీయంగా ట్రేడయ్యే ఉత్పత్తుల విలువలో ఇది సుమారు 35 శాతం. ఐఏటీఏ నివేదిక ప్రకారం విమానయాన రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5.7 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. 2.2 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడుతోంది. వివిధ దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కోణంలో చూస్తే 540 బిలియన్ డాలర్ల విలువతో.. ఈ రంగం ప్రపంచంలో 19వ స్థానాన్ని దక్కించుకుంటుంది. అంతర్జాతీయ ఎయిర్‌లైన్ పరిశ్రమ 2014లో ఏకంగా 743 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని అంచనా.
 
 ఐఏటీఏ ప్రత్యేక వేడుకలు..
 వాణిజ్య విమాన సేవలు ప్రారంభమై వందేళ్లయిన సందర్భంగా ఐఏటీఏ ఈ ఏడాది ప్రత్యేక వేడుకలను తలపెట్టింది. ప్రత్యేకంగా ఫ్లయింగ్100ఇయర్స్‌డాట్‌కామ్ పేరిట వెబ్‌సైట్ కూడా ప్రారంభిస్తోంది. విమాన సేవలకు సంబంధించి చారిత్రక, ఆర్థిక ప్రాధాన్యమున్న విశేషాలను ఐఏటీఏ ఇందులో ఉంచుతుం ది. అంతేగాదు తొలి విమాన సర్వీసు ఘట్టాన్ని మరోసారి ఆవిష్కరించేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. అచ్చం అప్పటి ఏరోప్లేన్‌ని తలపించే విమానాన్ని సెయింట్ పీటర్స్‌బర్గ్-తంపా రూట్లో నడపనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement