లొంగిపోయాడా?

లొంగిపోయాడా?


 చోటా రాజన్ అరెస్టుపై సందేహాలు

 

 (సెంట్రల్ డెస్క్): ఇరవై ఏళ్లుగా భారత చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న చోటా రాజన్ నిజంగానే అరెస్టయ్యాడా? లేక తనకు తానుగా లొంగిపోయాడా? కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న రాజన్ అనుచరవర్గాన్ని దాదాపుగా కోల్పోయాడని, దావూద్ కుడిభుజం చోటా షకీల్ నుంచి ప్రాణహాని పొంచివుండటంతో భారత్‌లోని జైళ్లే తనకు సురక్షితమని భావించి లొంగిపోయాడనే వాదన వినిపిస్తోంది. చోటుచేసుకున్న పరిణామాలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. ఒంటరి ప్రయాణం... ముఖం నిండా నవ్వు

 మోహన్‌కుమార్ అనే మారుపేరుతో జి9273860 నంబరుతో రాజన్‌కు 2008లో సిడ్నీలో భారత పాస్‌పోర్ట్ మంజూరు అయ్యింది. ఉన్నతస్థాయిలో సహకారం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనేది కొందరి వాదన. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చోటారాజన్ ప్రాణహానిని తప్పించుకోవడానికి లొంగిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చి ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లోని ఉన్నతాధికారులకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఒకప్పటి ఐబీ అధినేత, ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అరెస్టు అనబడే లొంగుబాటు వ్యవహారాన్ని డీల్ చేశారని, ఎప్పుడు, ఎలా జరగాలనేది ప్లాన్ చేసి... ఆదివారం సిడ్నీ నుంచి బాలిలో దిగగానే ఇండోనేసియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. గత ఏడాది చివరి నాటికే అనుచరగణాన్ని దాదాపుగా కోల్పోయిన రాజన్ ప్రాణభయంతో వణికిపోయాడని, పోలీసులకు చిక్కగానే రిలీఫ్‌గా ఫీలయ్యాడని, అతని ముఖంలో చిరునవ్వు దీని ఫలితమేనని పరిశీలకుల విశ్లేషణ. మాఫియా డాన్ అయిన రాజన్ సురక్షితమని భావించకపోతే... ఎందుకు ఒంటరి ప్రయాణం చేస్తాడనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే ఎలాంటి ప్రతిఘటనా లేకుండా అతను లొంగిపోవడం కూడా గమనార్హం. బంధం గట్టిదే...!

 దావూద్ గ్యాంగ్ సభ్యులను, ఐఎస్‌ఐ తరఫున పనిచేస్తున్న వారిని ఏరిపారేయడానికి రాజన్‌ను భారత ఏజెన్సీలు వాడుకున్నాయి. పాక్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఎస్ మాస్టర్‌మైండ్ ఖాలిద్ మసూద్, నేపాల్ చట్టసభల సభ్యుడు దిల్షాద్ మీర్జా బేగ్, పర్వేజ్ టాండాలను ఐబీ సహకారంతోనే రాజన్ ముఠా మట్టుబెట్టింది. దావూద్‌కు సన్నిహితులుగా భావించే తకీయుద్దీన్ వాహిద్‌ఖాన్ (ఈస్ట్‌కోస్ట్ ఎయిర్‌లైన్స్) జమీమ్ షా (నేపాల్ కేబుల్ ఆపరేటర్)లను హతమార్చడంలోనూ రాజన్ గ్యాంగ్ హస్తముందని భావిస్తారు.1998 తప్పుడు పాస్‌పోర్ట్‌పై ప్రయాణిస్తూ థాయ్‌లాండ్‌లో చోటా రాజన్ దొరికిపోయాడు. ఇంటర్‌పోల్ నోటీసు ఉన్నప్పటికీ అప్పుడు భారత్ అతనికోసం పెద్దగా ఆసక్తి చూపలేదట. ఒక్కరోజులోనే విడుదలయ్యాడు. తర్వాత 2000 సంవత్సరంలో బ్యాంకాక్‌లోనే డి గ్యాంగ్ అతనిపై దాడి చేసినపుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో థాయ్ పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రశ్నించడానికి భారత్ నుంచి ఐదుగురు పోలీసులు బృందం బ్యాంకాక్‌కు బయలుదేరింది. ఈలోపే అనుచరులు విజయ్ షెట్టి, సంతోష్ షెట్టిలు రాజన్‌ను ఆసుపత్రి నుంచి తప్పించారు. ఇక్కడా భారత ఏజెన్సీల పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై పోలీసులకు సమాచారం లేదు

 చోటా రాజన్‌పై ఉన్న కేసుల్లో సింహభాగం ముంబైలో నమోదైనవే. అయితే అతని అరెస్టు లేదా లొంగుబాటుకు సంబంధించి ముంబై పోలీసులకు ఎలాంటి సమాచారమూ లేదట. 2005లో దావూద్ పెద్ద కూతురు మహ్రూక్‌ను జావిద్ మియాందాద్ కుమారుడు జునైద్‌కు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. అప్పుడు ఐబీ చీఫ్‌గా ఉన్న అజయ్ దోవల్... ఈ పెళ్లి వేడుకలో దావూద్‌ను టార్గెట్ చేయాలని ప్లాన్ వేశారు. రాజన్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ వికీ మల్హోత్రా, ఫరీద్ తనాషాలను ఈ పనిమీద కరాచీకి పంపాలని నిర్ణయించారు. వేడుక జరిగే మండపంలోకి దావూద్ రాగానే వికీ అతన్ని కాల్చాలనేది పథకం.వీరిద్దరూ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా... దోవల్ ప్లాన్ గురించి తెలియని ముంబై పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్లాన్ తలకిందులైంది. ఈ విషయాన్ని హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ ఆగష్టులో ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ వెల్లడించారు కూడా. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకూడదని భావించారేమో... రాజన్ వ్యవహారాన్ని ఈసారి ముంబై పోలీసులకు తెలియకుండా గుట్టుగా ఉంచారు.

 

 మంచి బాలుడు

 గిర్వి.. పశ్చిమ మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఫల్తాన్ తెహసీల్‌లో ఓ చిన్న గ్రామం. గతంలో అక్కడ ఒక గుడిసె ఉండేది. ఆ తర్వాత అది ఓ పెద్ద భవంతిగా అవతరించింది. ఆ భవంతి పేరు సదాలక్ష్మి. ఆ చుట్టుపక్కల దాన్ని మించిన కట్టడం లేదని ఆ గ్రామస్తులు చెబుతారు. 20 ఏళ్లుగా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ రాజేంద్ర సదాశివ్ నికల్జే అలియాస్ చోటా రాజన్ తన చిన్నప్పుడు అక్కడ ఎక్కువ కాలం గడిపాడు. రాతి గోడలతో, ఇనుపగేట్లతో పకడ్బందీగా నిర్మించిన ఆ ప్యాలెస్‌లో అందమైన లాన్‌లు కూడా ఉన్నాయి. 50ల్లో ముంబైకి వలసవెళ్లిన రాజన్ తండ్రి సదాశివ్ సఖరాం నికల్జే విగ్రహమూ అక్కడ ఉంది.రాజన్ చిన్నప్పుడు తమ దుకాణానికి తరచుగా వచ్చేవాడని, అతడు మంచి బాలుడని ఓ గ్రామస్తుడు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ముంబైలోపుట్టిన రాజన్ వేసవి సెలవుల్లో, దీపావళి సెలవుల్లో గిర్వి గ్రామానికి వచ్చేవాడన్నారు. ముంబైలో అండర్ వరల్డ్ డాన్‌గా మారిన తర్వాత ఇక్కడికి రావడం మానేశాడని చెప్పారు. అయితే కుటుంబ శుభకార్యాలు జరిగినప్పుడు మాత్రం రాజన్ భార్య, సోదరులు ఇక్కడికి వస్తుంటారని మరో గ్రామస్తుడు చెప్పారు. 1976లో తండ్రి మరణానంతరం రాజన్ సొంత గ్రామానికి రావడం మానేశాడ న్నారు. రాజన్ నేర కార్యకలాపాల్లో పాలుపంచుకునేవాడని అంగీకరించిన గ్రామస్తులు.. దావూద్ ఇబ్రహీంకు విరోధిగా మారడాన్ని మాత్రం స్వాగతించడం గమనార్హం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top