మీ సేవలో.. మాయా దర్పణం!

మీ సేవలో.. మాయా దర్పణం! - Sakshi


అలెక్సా... సిరి... కోర్టానా. ఈ పేర్లు మనకు పెద్దగా పరిచయం లేకపోవచ్చుగానీ... ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్‌ అసిస్టెంట్స్‌ వీళ్లంతా! మన మాటే మంత్రంగా... మనం చెప్పే పని (మెయిల్‌ చూడటం, సమాచారం ఇవ్వడం వంటివి) చేసి పెట్టేస్తాయి ఇవి. అయితే ఇప్పటివరకూ ఇవన్నీ కేవలం ఆడియోకే పరిమితమైపోయాయి. ఇప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ అద్దంతో పరిస్థితి మారిపోనుంది అంటోంది డాప్ట్‌లీ డిస్‌ప్లే!



అమెరికన్‌ కంపెనీ ఈ డిస్‌ప్లేని అభివృద్ధి చేసింది. పొద్దున్న లేవగానే... మీరు ఈ అద్దం ముందు నిలబడితే చాలు.. డాప్ట్‌లీ మిమ్మల్ని గుర్తు పడుతుంది. హలో చెబుతుంది. ఈలోపు మీరు బ్రష్‌పై పేస్ట్‌ వేసేసుకుని.. ‘‘ఏంటి ఈ రోజు వార్తలు’’ అని అనడం ఆలస్యం.. ఆవేళ్టి ముఖ్యమైన వార్తల్ని చదివి వినిపిస్తూంటుంది. ఇంకోవైపు మీకు ఇష్టమైన న్యూస్‌ ప్రోగ్రామ్‌ ప్రత్యక్షమవుతుంది. ఈలోపుగానే మీరు మెయిల్స్‌ ఓపెన్‌ చేయి అనేసి వాటిని చూస్తూండవచ్చు కూడా. చేతి కదలికలతోనే... అద్దంపై కనిపించే మెయిల్స్‌ను వరుసగా చూడవచ్చు. అనవసరమైన వాటిని అక్కడికక్కడే ట్రాష్‌లో పడేయవచ్చు కూడా. మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఎవరికైనా ఫోన్‌ చేయాలనుకోండి. సింపుల్‌. వారికి కాల్‌ చేయమని డాప్ట్‌లీకి చెబితే చాలు. మొబైల్‌ అవసరం లేకుండానే  వీడియోకాల్‌ రెడీ ఐపోతుంది. మీరు అద్దం ముందు నుంచి తప్పుకున్న వెంటనే ఈ సమాచారమంతా మాయమైపోతుంది. ఇతర కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వారిని కూడా పేరుపేరునా గుర్తుపెట్టుకుని పలకరించడంతోపాటు వారికి కావాల్సిన సమాచారం ఇస్తుంది కూడా.



అంతేకాదు.. ఈ సూపర్‌ హైటెక్‌ అద్దాన్ని ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, లైట్‌ బల్బులకు అనుసంధానించుకుంటే చాలు.. వాటిని కూడా మన మాటలతో నియంత్రించవచ్చు. ఉదాహరణకు పడుకోబోయే ముందు బెడ్‌రూమ్‌లోని ఏసీ ఆన్‌ చేయమని, మిగిలిన గదుల్లోని అన్ని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్‌ చేయమని ఆర్డర్‌ ఇవ్వవచ్చు. ఎవరూ వాడని సమయంలో దీన్ని ఆఫ్‌ చేసుకోవచ్చు. లేదంటే... అందమైన ఫొటోఫ్రేమ్‌గానూ ఉపయోగపడుతుంది. అబ్బో... భలే ఉందే వ్యవహారం.. మా ఇంట్లోనూ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారా? కొంచెం ఆగండి.  ఇది అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో తొమ్మిది నెలలు పడుతుంది. ధర దాదాపు రూ.50 వేల వరకూ ఉండవచ్చునని అంచనా.

 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top