ఖరీదైన పరుపులే కొంటున్నారు


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ప్రజల్లో సుఖ నిద్రకు ప్రాధాన్యం పెరిగింది. ఇందుకోసం నాణ్యమైన పరుపులు కావాలంటున్నారు. నాలుగేళ్ల క్రితం సింహభాగం అమ్మకాలు రూ.6-8 వేల ధర గల పరుపులవి. ఇప్పుడు రూ.20-30 వేల ధరగల పరుపులే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి’ అని కర్లాన్ ఎండీ టి.సుధాకర్ పాయ్ చెప్పారు.



పరుపుల కోసం లక్ష రూపాయలకుపైగా వెచ్చించడానికి కూడా జనం వెనకాడటం లేదని చెప్పారాయన. మణిపాల్ గ్రూపునకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సుధాకర్ పాయ్... శనివారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..



 ప్రధానం కాబ ట్టే..

 కోట్ల విలువ చేసే కారున్నా అందులో ప్రయాణించేది కొద్దిసేపే. ప్రతిరోజు ఎంత కాదన్నా మూడింట ఒకవంతు సమయం పడక మీదే. మంచి పరుపు ఉంటే మంచి నిద్ర ఖాయం. అందుకే కస్టమర్లు పరుపుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. భారత్‌లో మొత్తం పరుపుల అమ్మకాల్లో రూ.20-30 వేల విభాగం వాటా 35 శాతం. కర్లాన్ అమ్మకాల్లో రూ.1 లక్ష ఆపై ఖరీదున్న లగ్జరీ పరుపుల వాటా 5 శాతం ఉంది. రూ.3 వేల నుంచి మా ఉత్పత్తులు లభిస్తాయి. వాలెంటినో పేరుతో లగ్జరీ పరుపులను తయారు చేస్తున్నాం. రూ.1,91,500 ధర గలవీ ఉన్నాయి.



 ఏ డిజైన్ కావాలన్నా..

 స్పైన్ కేర్, ఆర్థో కేర్ వంటి ప్రత్యేక పరుపులు కూడా రూపొందిస్తున్నాం. కస్టమర్ల ఆర్డరునుబట్టి పరుపులకు డిజైన్ చేసి ఇస్తున్నాం. మొత్తంగా ఏటా 3 వేల రకాల సైజుల్లో వీటిని తయారు చేస్తూ భారత్‌లో వ్యవస్థీకృత రంగంలో 45 శాతం వాటాతో అగ్రగామి కంపెనీగా ఉన్నాం. 1962లో ఈ రంగంలో ప్రవేశించాం. పరుపులకు మారు పేరుగా కర్లాన్‌ను నిలబెట్టాం. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలిగించే స్పైన్ కేర్ పరుపులను రూ.20 వేలకే విక్రయిస్తున్నాం. అమెరికాలో అయితే ఇటువంటి ఉత్పత్తుల ధర భారత కరెన్సీలో రూ.3 లక్షల దాకా ఉంది.



 కొత్త విభాగాల్లోకి..

 బెడ్‌షీట్లు, కర్టైన్లు, ఫర్నిచర్ వంటి ఇతర విభాగాల్లోకి ఇటీవలే అడుగు పెట్టాం. మొత్తం ఆదాయంలో వీటి వాటా ప్రస్తుతం 10 శాతమే. ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో ఈ విభాగం నుంచి అధిక వ్యాపారం ఆశిస్తున్నాం. కంపెనీ 2013-14లో రూ.850 కోట్ల టర్నోవర్ అంచనా వేస్తోంది. ఏటా 25-30 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం. గుజరాత్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు ఏప్రిల్‌కల్లా సిద్ధమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు ఏర్పాటు చేయాలన్న యోచన ఉంది. కొత్త ప్లాంటుకు ఎంత కాదన్నా రూ.100 కోట్లు వ్యయం అవుతుంది. కర్లాన్ అమ్మకాల్లో తొలి నాలుగు స్థానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఉంటాయి.



 స్టోర్ బ్రేక్ ఈవెన్‌కు ఏడాది...

 దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీ విధానంలో 140 స్టోర్లను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లో ఎనిమిది ఉన్నాయి. ప్రతి స్టోర్‌కు రూ.10-25 లక్షల పెట్టుబడి అవుతుంది. స్టోర్‌ను యజమాని చక్కగా నిర్వహిస్తే ఏడాదిలో లాభనష్టాలు లేని స్థితికి చేరుకోవచ్చు. పరుపుల మార్కెట్ పరిమాణం భారత్‌లో రూ.4,500-5,000 కోట్లుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 25 శాతమే. కానీ వృద్ధి 12-15 శాతం ఉంది. అదే అవ్యవస్థీకృత రంగం వృద్ధి కేవలం 5 శాతమే. అమ్మకాల్లో ఫోమ్‌తో తయారైన పరుపులు 70 శాతం ఉంటాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top