రాజ్యాంగ విరుద్ధంగా విభజన | Bifurcation contrast to the constitution: Andhra Pradesh journalists forum | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ విరుద్ధంగా విభజన

Nov 10 2013 2:58 AM | Updated on Sep 27 2018 5:59 PM

‘రాష్ట్రాన్ని విభజించడమంటే కొత్తగా ఓ జిల్లాను సృష్టించడం లాంటిదనుకుంటున్నారా? ప్రజల అభిప్రాయాలకు విలువ లేదు. అవి ప్రతిఫలించాల్సిన అసెంబ్లీలో చర్చ లేదు.

‘ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం’ భేటీలో జేఏసీలు
 సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని విభజించడమంటే కొత్తగా ఓ జిల్లాను సృష్టించడం లాంటిదనుకుంటున్నారా? ప్రజల అభిప్రాయాలకు విలువ లేదు. అవి ప్రతిఫలించాల్సిన అసెంబ్లీలో చర్చ లేదు. పార్లమెంటులో చర్చకు అవకాశమివ్వలేదు. మన రాష్ట్రంతో సంబంధం లేని నేతలు, మన సంస్కృతేమిటో అవగాహన లేని సోనియాలు కలిసి, రాజకీయ లబ్ధి కోసం విభజన నిర్ణయం తీసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? అబద్ధాలతో మభ్యపెట్టి విభజిస్తే తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడే సీమాంధ్ర, తెలంగాణ రెండూ తీవ్రంగా నష్టపోతాయి. కేంద్రానికి అమ్ముడుపోయిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఖరి, అక్కడి ఇతర నేతల వైఫల్యమే ఈ దుస్థితికి కారణం.

విభజన ప్రక్రియ ఆగిపోకుంటే మన తెలుగు సాంస్కృతిక ఔన్నత్యమే ప్రమాదంలో పడుతుంది. సోదరభావంతో కలిసుండాల్సిన తెలుగువాళ్లు నీళ్ల కోసం కొట్టుకు చస్తారు’’ అని సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వివిధ జేఏసీలు తీవ్ర ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేశాయి. ‘ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం’ శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ జేఏసీలు, సీమాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రముఖులు హాజరై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు...
 
 నీటి కొట్లాటలు తప్పవు
 ‘‘విభజనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. మధ్యప్రదేశ్‌లో ఓడిపోయిన నేత, కాశ్మీర్‌లో గెలవలేని వ్యక్తి, గుజరాత్‌లో ఎవరో కూడా తెలియని మరో నేత కలిసి తెలుగు వారితో ప్రమేయం లేకుండా విభజన చేస్తున్నారు’’
 - విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి,
 రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి
 
 విభజనకు తెలంగాణలోనూ వ్యతిరేకత
 ‘‘తెలంగాణ ప్రజల్లో చాలామంది విభజనకు వ్యతిరేకం. ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాగానే మళ్లీ ఉద్యమిస్తాం. ప్రజాకాంక్షకు వ్యతిరేకంగా విభజన జరిగితే భవిష్యత్తులో ప్రజాయుద్ధం తప్పదు’’
 - ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు
 
 సుప్రీం పట్టించుకుంటుంది
 ‘‘ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటులో అసెంబ్లీల అభిప్రాయాల మేరకు వ్యవహరించారు. ఇప్పుడలా చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు’’
 - సీవీ మోహన్‌రెడ్డి, సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ అధ్యక్షుడు
 
 మభ్యపెడుతున్నారు
 ‘‘కేంద్రం తీరు అక్షయ పాత్ర తీసుకుని సీమాంధ్రకు భిక్షా పాత్ర ఇస్తున్నట్టుగా ఉంది’’
 - చలసాని శ్రీనివాసరావు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement