తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం | zindal company declares ready to investments in telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం

Feb 20 2015 6:04 AM | Updated on Sep 2 2017 9:38 PM

సచివాలయంలో కేసీఆర్ తో భేటీ అయిన జిందాల్ సౌ లిమిటెడ్ సీఈవో నీరజ్ కుమార్,తదితరులు

సచివాలయంలో కేసీఆర్ తో భేటీ అయిన జిందాల్ సౌ లిమిటెడ్ సీఈవో నీరజ్ కుమార్,తదితరులు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది.

 సీఎం కేసీఆర్‌ను కలసిన జిందాల్ ప్రతినిధులు
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. రాష్ర్ట ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. జిందాల్ సా లిమిటెడ్ సీఈవో నీరజ్‌కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనీష్‌కుమార్ తదితరులు గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగస్వాములు అయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్ పథకానికి అవసరమయ్యే పైపులను సరఫరా చేసేందుకు జిందాల్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు.
 
 తెలంగాణలో పైపుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతామన్నారు. ఉక్కు పరిశ్రమ స్థాపనలో జిందాల్ కంపెనీకి ఉన్న అనుభవం దృష్ట్యా బయ్యారం ప్రాంతంలో పరిశ్రమను స్థాపనకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వారికి సూచించారు. వాటర్‌గ్రిడ్‌కు పైపుల సరఫరాపై జిందాల్ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు. పరిశ్రమలకు కావలసినంత భూమి, నీరు, తెలంగాణలో అందుబాటులో ఉందని, విద్యుదుత్పత్తి కోసం చేస్తున్న ప్రయత్నాలు రెండేళ్లలో ఫలిస్తాయని సీఎం వెల్లడించారు.

హైదరాబాద్‌లో మెట్రోరైల్‌ను మరింత విస్తరిస్తామని, నగర శివార్లలో ఫార్మా, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఏరోస్పేస్, ఐటీ పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిందాల్ ప్రతినిధులను సీఎం కేసీఆర్ కోరారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, జిందాల్ కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవసింగ్ కూడా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement