ఆర్థిక ఇబ్బందులతో కరీంనగర్ జిల్లాలో ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బెజ్జంకి : ఆర్థిక ఇబ్బందులతో కరీంనగర్ జిల్లాలో ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెజ్జంకి మండలం పారువెల్ల గ్రామానికి చెందిన సాయిని అనిల్(25) అనే యువ రైతు ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి బాధ్యతలు కూడా ఇతడే చూస్తున్నాడు. వ్యవసాయంతోపాటు ధాన్యం వ్యాపారం కూడా నిర్వహిస్తుంటాడు అనిల్.
అయితే ఇతడు సాగు, వ్యాపార అవసరాల కోసం రూ.7 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆదివారం అర్ధరాత్రి సమయంలో కాసంపేట వాటర్ సంప్ వద్దకు చేరుకుని పురుగుమందు తాగి పడిపోవడంతో స్థానికులు గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారొచ్చి అనిల్‌ను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.