Sakshi News home page

ప్రభుత్వభూములు అమ్మి నిధులు తెస్తాం: కేసీఆర్

Published Mon, Nov 24 2014 2:48 PM

ప్రభుత్వభూములు అమ్మి నిధులు తెస్తాం: కేసీఆర్ - Sakshi

నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు అమ్మి నిధులు సమకూరుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని పట్టణప్రాంత ఎమ్మెల్యేలతో ఆయన ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు. పట్టణప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, మురికివాడల మెరుగు, గృహనిర్మాణానికి కొత్త విధానం తీసుకొస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమన్వయంతో తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల స్థితిగతులు మెరుగుపడాల్సి ఉందని ఆయన చెప్పారు.

ప్రభుత్వ కార్యాలయాల విషయంలో సొంత భవనాలు కావాల్సినవి, మరమ్మతులు చేయాల్సినవి, కొత్తగా కట్టాల్సిన వాటిపై కలెక్టర్ల నుంచి నివేదిక తెప్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పట్టణప్రాంతాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకం అమలు చేస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతను ఐదేళ్ల వరకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని తెలిపారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, గజ్వేల్ పట్టణాలకు రింగ్ రోడ్లు ఏర్పాటుచేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement