బోర్డు ఆదేశాలు బేఖాతరు   

Water use from below the minimum stages in Srisailam - Sakshi

శ్రీశైలంలో కనీస మట్టాలకు దిగువ నుంచి నీటి వినియోగం

ఏపీ హంద్రీనీవా, తెలంగాణ కల్వకుర్తి కోసం నీటి తరలింపు 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాల దిగువన నీటిని తోడటం మొదలైంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, తమ అనుమతి లేకుండా కనీస నీటి మట్టాల దిగువన నీటిని తీసుకోరాదన్న కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నీటి వినియోగం మొదలు పెట్టాయి. 2,124 క్యూసెక్కుల మేర నీటిని ఇరు రాష్ట్రాలు తమతమ అవసరాల నిమిత్తం శ్రీశైలం నుంచి వాడుకున్నాయి. గతేడాదితో పోలిస్తే శ్రీశైలంలో ఈ ఏడాది నీటి వినియోగం గణనీయంగా పెరగడంతో ముందుగానే ప్రాజెక్టులో నీటి మట్టాలు తగ్గాయి. గతేడాది 885 అడుగుల నీటి మట్టానికి గాను 856 అడుగులమట్టంలో నీరుం డగా, ఈ ఏడాది అది 833.80 అడుగుల మట్టానికి పడిపోయింది. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 834 అడుగులే. నీటి మట్టం తగ్గతున్న నేపథ్యం లో రెండ్రోజుల కిందటే ఎట్టి పరిస్థితుల్లోనూ కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లరాదని కృష్ణా బోర్డు తెలుగు రాష్ట్రాలను హెచ్చరించింది.  

త్రిసభ్య భేటీ వరకు వద్దన్నా.. : కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ జరిగే వరకు కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లే అంశంపై ఎలాంటి నిర్ణయాలు చేయరాదని ఇదివరకే సూచించింది. అయినప్పటికీ ఇరు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని మొదలుపెట్టాయి. గురువారం ఏపీ శ్రీశైలం నుంచి హంద్రీనీవా కాల్వలకు 860 క్యూసెక్కులు, తెలంగాణ కల్వకుర్తి అవసరాలకు 1,264 క్యూసెక్కుల నీటిని తరలించాయి. దీంతో జలాలు కనీస నీటి మట్టానికి దిగువకు పడిపోయాయి. అయితే ఇరు రాష్ట్రాలు ఎంతకాలం, ఏ మేర నీటిని తరలించుకుంటాయన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో బోర్డు ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే. గతంలో కనీస నీటి మట్టాల దిగువన నీటిని తోడినప్పుడు పూర్తి స్థాయి బోర్డు సమావేశాల్లోనే వీటిపై ఏ నిర్ణయం అనేది తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చే వారం బోర్డు సమావేశం జరుగుతుండొచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top