
పరామర్శల వెల్లువ..
మాసాయిపేట దుర్ఘటనలో గాయడిన చిన్నారులు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పలువురు నేతలు శుక్రవారం అక్కడికి చేరుకున్నారు.
బన్సీలాల్‌పేట/రాంగోపాల్‌పేట: మాసాయిపేట దుర్ఘటనలో గాయడిన చిన్నారులు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పలువురు నేతలు శుక్రవారం అక్కడికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రభుత్వమిచ్చే ఎక్స్‌గ్రేషియాను పెంచాలని డిమాండ్ చేశారు.
ఎక్స్‌గ్రేషియా రూ.10లక్షలు చెల్లించాలి..
ఆధునికతను అందిపుచ్చుకుంటున్నామని చెబుతున్న రైల్వే శాఖ కాపలాలేని గేట్లతో వందల మంది ప్రాణాలు బలిగొనడం బాధాకరమని తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డిలతో కలిసి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రైల్వే శాఖను డిమాండ్ చేశారు. క్షతగాత్రులైన విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు.
రైల్వే అధికారులపై కేసులు పెట్టాలి
కాపలా గేటు ఏర్పాటు చేయాలని స్థానికులు పలుమార్లు కోరినా రైల్వే అధికారులు పట్టించుకోలేదని పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య అన్నారు. ఫలితంగా 16 మంది చిన్నారులు బలి అయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన రైల్వే అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆమె బాధిత కుటుంబాలను పరామర్శించారు.
పీడీఎస్‌యూ నిరసన ప్రదర్శన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన జరిగిందని పీడీఎస్‌యూ నేతలు ఆరోపించారు. శుక్రవారం వారు యశోద ఆస్పత్రి ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నాయకులు చంగాని దయాకర్, ఎన్.శేషు, విద్యాసాగర్‌రెడ్డి, పరశురాం, స్వామి, సైదులు తదితరుల ఆధ్వర్యంలో కొద్దిసేపు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఏబీపీవీ ఆధ్వర్యంలో రక్తదానం..
ఏబీవీపీ మేడ్చెల్, సికింద్రాబాద్ పీజీ కళాశాల విభాగాల ఆధ్వర్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల కోసం రక్తదానం చేశారు. ఏబీవీపీకి చెందిన 45 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అర్జున్, వినయ్, క్రాంతి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.