సభలో క్షమాపణ రచ్చ | uproars in telangana asembly on excuse | Sakshi
Sakshi News home page

సభలో క్షమాపణ రచ్చ

Mar 10 2015 3:16 AM | Updated on Aug 11 2018 6:42 PM

హైదరాబాద్ : విపక్ష సభ్యులు జాతీయగీతాన్ని అవమానపరిచారన్న దానిపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ వ్యవహారం సోమవారం అసెంబ్లీలో ఆసక్తి రేపింది. ‘క్షమాపణ’ అనే పదం వాడకుండానే అధికార సభ్యులను ఇరుకున పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు.

హైదరాబాద్ : విపక్ష సభ్యులు జాతీయగీతాన్ని అవమానపరిచారన్న దానిపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ వ్యవహారం సోమవారం అసెంబ్లీలో ఆసక్తి రేపింది. ‘క్షమాపణ’ అనే పదం వాడకుండానే అధికార సభ్యులను ఇరుకున పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. క్షమాపణ చెప్పడం లేదంటూ స్పీకర్ పదే పదే మైక్ కట్ చేయడం.. సంపత్ సస్పెన్షన్‌కు హరీశ్ సిద్ధమవడం.. ప్రతిపక్ష నేత జానారెడ్డి కల్పించుకొని క్షమాపణ చెప్పాలని సొంత పార్టీ సభ్యుడికే సూచించడం వంటి పరిణామాలతో శాసనసభలో హైడ్రామా చోటు చేసుకుంది.
 నాలుగుసార్లు మైక్ కట్
 టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు స్పీకర్ మాట్లాడే అవకాశమిచ్చారు. అయితే క్షమాపణ అంశాన్ని పక్కనబెట్టి.. గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీఆర్‌ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరుపై సంపత్ చురకలంటించారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్ చూపిన వీడియో ఫుటేజీ స్పష్టంగా లేదని కూడా ఆయన చెప్పారు. దీంతో క్షమాపణ చెప్పడం లేదంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. జానారెడ్డి జోక్యం చేసుకుని తమ సభ్యుడు క్షమాపణ చెప్పేందుకు అవకాశమివ్వాలని కోరడంతో స్పీకర్ మళ్లీ అవకాశమిచ్చారు.
 
సంపత్ మళ్లీ అధికార పార్టీ సభ్యులపై ధ్వజమెత్తారు. దీనికి టీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుతగిలారు. దీంతో స్పీకర్ మళ్లీ మైక్ కట్ చేశారు. తిరిగి అవకాశం ఇచ్చినప్పుడు సంపత్ మాట్లాడుతూ ‘సభ ఆర్డర్‌లో లేని పరిస్థితుల్లో జాతీయ గీతాలాపన మొదలుపెట్టారు. ఈ విషయంలో ఒకరికి ఒక నీతి, మరొకరికి ఇంకో నీతి ఉండకూడదు. అవమానపరిచే రీతిలో వ్యవహరించిన అందరితో క్షమాపణ చెప్పించండి’ అన్నారు. క్షమాపణ చెప్పకపోవడంతో మంత్రి హరీష్‌రావుకు స్పీకర్ మైక్ ఇచ్చారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆహ్వానిస్తామని మంత్రి అన్నారు. అనంతరం సంపత్‌కు తిరిగి స్పీకర్ మైకివ్వగా, ఎవరో చెప్పింది చెప్పేందుకు సభకు రాలేదని ఆయన అనడంతో సభలో మళ్లీ గందరగోళం రేగింది.
 
క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ నేతలు నినాదాలు చేస్తుండటం, సంపత్ క్షమాపణ చెప్పకపోవడంతో స్పీకర్ మళ్లీ మైక్ కట్ చేశారు. దీంతో మంత్రి హరీష్ లేచి సభ్యుడు క్షమాపణ చెప్పనందున సస్పెన్షన్ ప్రతిపాదన చేయబోయారు. ఈ దశలో మరోమారు కల్పిం చుకున్న జానారెడ్డి.. క్షమాపణకే పరిమితం కావాలని సంపత్‌కు సూచించారు. దీంతో మళ్లీ లేచిన సంపత్ ‘జరిగిన సంఘటనకు చింతి స్తున్నా. బాధపడుతున్నా. క్షమించాలని కోరుతున్నా’ అనీ అనగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. 
 విద్యా సంస్థల్లో గీతాలాపన అంశం ప్రస్తావన
 కాగా, కొందరు ప్రజా ప్రతినిధులు తమ విద్యా సంస్థల్లో జాతీయగీతాలాపన చేయడం లేదని సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు ఇప్పుడు జాతీయ గీతాన్ని అవమానిస్తారా అని మండిపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఘాటుగా స్పందించారు. సంపత్ ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ అక్బరుద్దీన్ స్పందించిన తీరును సభ్యులు ఆసక్తిగా గమనించారు. విద్యా సంస్థల్లో జాతీయ గీతాలాపన చేయకుండా ఆంక్షలు పెట్టిన వారెవరో బయటపెట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.
 
‘ఇది చాలా తీవ్ర అంశం. దీన్ని అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకోవాలి. వారి వారి సంస్థల్లో జాతీయ గీతాలాపన చేయని వారిని కఠినంగా శిక్షించాలి. దేశంలో ఉంటూ, ఇక్కడి ఉప్పు తింటూ జాతీయ గీతాలాపన చేయకపోవడం దారుణం. అలాంటి వారు దేశం బయట ఉండాలి’ అన్నారు. జాతీయ గీతాన్ని ఎవరు అగౌరవ పరిచినా కేవలం క్షమాపణతో సరిపోదని, వారిపై కఠిన చర్యలుండాలన్నారు. ఇది దేశ సమగ్రతకు సంబంధించిన అంశమని, ఈ విషయంలో మెతక వైఖరి మంచిది కాదని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement