అందని ఫలం.. బీసీ రుణం

Unemployed Waiting For BC loans - Sakshi

జిల్లాలో 11,542 దరఖాస్తులు

ఇంటర్వ్యూలు నిర్వహించని అధికారులు

అభ్యర్థుల ఎదురు చూపులు

బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.  

కమ్మర్‌పల్లి(బాల్కొండ) : బీసీ కార్పొరేషన్‌ 2018–19 సంవత్సరానికి గాను రుణాల మంజూరు కోసం ఏప్రిల్‌ 4 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా, జిల్లాలో 11,542 మంది నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తు ఫారం, సంబంధిత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌ కాపీల మూడు సెట్లను అభ్యర్థులు స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో సమర్పించాలని, గ్రామసభల తీర్మానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు సూచించారు.

ఈ ప్రక్రియ వారం రోజుల కిత్రం అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టారు. ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా లేని, అనర్హుల దరఖాస్తులను తిరస్కరించారు. వివరాలను మండల పరిషత్తు కార్యాలయంలో ఆన్‌లైన్‌ చేశారు. అయితే గ్రామస్థాయి అధికారులు లబ్ధిదారుల ఎంపిక మాత్రం చేపట్టలేదు. దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను పంపాలని మార్గదర్శకాలు జారీ అయినప్పటికీ, గ్రామస్థాయి అధికారులు అవేమీ పరిగణనలోకి తీసుకోలేదు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడితే లేనిపోని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్న దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేశారు. గతంలో సాధారణంగా దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తికాగానే వాటి ని పరిశీలించి 10 రోజుల్లోగా లబ్ధిదారుల ఎంపిక కోసం మౌఖిక పరీక్షలు(ఇంటర్వ్యూలు) నిర్వహించేవారు.

ప్రస్తుతం నెలలు గడుస్తున్నా ఇంటర్వ్యూలు నిర్వహించిన దాఖలాలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన హడావుడిలో ఉన్న అధికారం యంత్రాంగం కార్పొరేషన్‌ రుణాల ఎంపిక కోసం మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.   

అందని రాయితీ రుణాలు.. 

2015–16 సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతీ యువకులకు పూర్తిస్థాయిలో రాయితీ రుణాలు అందలేదు. 80 శాతం రాయితీ ప్రకటించడంతో దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. మండల స్థాయిలో ఎంపీడీఓ, బీసీ కార్పొరేషన్, బ్యాంక్, ఎంప్లాయిమెంట్, ఇతర అధికారులు కలిసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. సంక్షేమ రుణాల జారీలో అక్రమాలకు తావులేకుండా ప్రక్రియ అంతా బీసీ సంక్షేమ శాఖ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసింది.

కాని ఎంపికైన లబ్ధిదారుల్లో కొంతమందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు.  చాలామంది అభ్యర్థులకు రాయితీ రుణాలు అందలేదు. రుణాలు మం జూరైన లబ్ధిదారులతో బ్యాంకు అధికారులు జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు తెరిపించడంతో పాటు, డాక్యూమెంట్‌ ప్రక్రియ పూర్తి చేయించారు. కాని రుణాలు మంజూరు కాకపోవడంతో అభ్యర్థులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి చాలించుకున్నారు.

మరుసటి ఏడాదైనా రాకపోతాయా అని 2017–18 సంవత్సరంలో వేచి చూశారు. కాని ఆ సంవత్సరంలో రుణాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. రెండేళ్ల నుంచి రాయితీ రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈయేడు బ్యాంకు అంగీకారం లేకుండానే లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించడంతో అభ్యర్థులు  చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.  

రాయితీ పెంచడంతో డిమాండ్‌... 

కార్పొరేషన్‌ రుణాలకు రాయితీ పెంచడంతో డిమాండ్‌ విపరీతంగా ఏర్పడింది. రుణాలను మూడు కేటగిరిలుగా విభజించారు. 1వ కేటగిరిలో రూ. 1 లక్ష వరకు రుణ సదుపాయానికి 80 శాతం రాయితీ, 2వ కేటగిరిలో రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రుణ సదుపాయానికి 70 శాతం రాయితీ, 3వ కేటగిరిలో రూ. 2 లక్షల నుంచి 12 లక్షల వరకు రుణానికి 60 శాతం రాయితీ ప్రకటించారు.

రుణాలకు రాయితీ అధికంగా ఉండడంతో అభ్యర్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కులాల వారీగా, బీసీ ఫెడరేషన్‌ ప్రకారం యూనిట్ల కేటాయింపు ఉండే అవకాశం ఉందని ప్రచారం ఉండడంతో ఆశావహులు తమకు రుణాలు మంజూరవుతాయని నమ్మకంతో ఉన్నారు.  

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా..? 

రుణాల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతుందనేది అయోమయం నెలకొంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకు సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ చేపట్టి ఇంటర్వ్యూల కోసం తేదీని ప్రకటించి అధికార బృందం లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ మొదలు రుణాలు వచ్చే వరకు అంతా ఆన్‌లైన్‌ ప్రక్రియనే కొనసాగిస్తుండడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది.

ఇంతవరకు మండలానికి ఎన్ని యూనిట్లు కేటాయించారో స్పష్టంగా తెలియజేయలేదు. లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల తీర్మానం ద్వారానే చేపట్టాలని మార్గదర్శకాలు జారీ అయినప్పటికీ, గ్రామస్థాయిలో అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేయలేదు.

ధ్రువీకరణ పత్రాలు సరిగ్గాలేని, ఆన్‌లైన్‌ చేయని దరఖాస్తులను తిరస్కరించి మిగతా అన్ని వాటితో లబ్ధిదారుల జాబితాను రూపొందించి ఆన్‌లైన్‌ చేశారు. దరఖాస్తు చేసుకున్న అందరూ అర్హులైతే ఎంతమందికి రాయితీ రుణాలు అందుతాయో వేచి చూడాల్సిందే. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తారా అనే సంశయం నెలకొంది 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top