తెల్ల రేషన్‌కార్డు (ఎఫ్‌ఎస్‌సీ) దారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు పంపింది.
	ఉగాదికి అదనపు చెక్కర కోటా
	ఒక్కో కార్డుకు అదనంగా అర కిలో
	ఈ నెల కోటాలోనే పంపిణీ
	 
	హన్మకొండ అర్బన్ : తెల్ల రేషన్‌కార్డు (ఎఫ్‌ఎస్‌సీ) దారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు పంపింది. ఈ నెల 21న తెలుగు సంవత్సరాది (ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆహారభద్రత కార్డుదారులకు ఒక్కో కార్డుకు అదనంగా అర కిలో చెక్కెర కోటా విడుదల చేసింది. మార్చి నెల కోటాలోనే కార్డుదారులకు అందజేయాలని పేర్కొంది.  మేరకు జిల్లాలోని రేషన్‌డీలర్లు వెంటనే సంబంధిత చెక్కర కోసం తమకు ఉన్న అలాట్‌మెంట్ ఆధారంగా డీడీలు తీయాలని జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఉగాదిలోపే పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు.
	
	9.81 లక్షల మంది కుటుంబాలకు లబ్ధి
	
	ప్రస్తుతం ఉగాదికి ప్రభుత్వం ఇస్తున్న అదనపు కోటా అరకిలో చెక్కరతో జిల్లాలో 9.81 లక్షల మంది కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. జిల్లాలోని 9,81,639 ఆహారభద్రత కారుల్లో 29,42,070 యూనిట్లు ఉన్నాయి. వీరికోసం ప్రతి నెల పౌరసరఫరాల శాఖద్వారా సుమారు 4.908 మెట్రిక్ టన్నుల చెక్కర సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అంతే మొత్తంలో ఆదనపు కోటాగా జిల్లాకు వచ్చింది. డీడీలు తీసిన వెంటనే రేషన్‌షాపులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదనపు కోటాకు డీడీలు అందజేస్తే సోమ, మంగళవారాల్లో పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
