పైరవీల జోరు | TRS leaders queue for nominated posts | Sakshi
Sakshi News home page

పైరవీల జోరు

May 20 2014 1:50 AM | Updated on Sep 2 2017 7:34 AM

తాజాగా జరిగిన పరిషత్, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్ నాయకులు ప్రస్తుతం తదుపరి ప్రయత్నాల్లో బిజీ అయ్యారు.

సాక్షి, మంచిర్యాల : తాజాగా జరిగిన పరిషత్, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్ నాయకులు ప్రస్తుతం తదుపరి ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. గెలిచిన నాయకులు ఏర్పడబోయే ప్రభుత్వంలో ప్రముఖ పదవులపై కన్నేస్తే.. ఓడిన నేతలు తమకు పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. దీంతోపాటు టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం పలువురితో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కారు జోరు స్పష్టంగా కొనసాగింది. పెద్ద ఎత్తున కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతోపాటు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.

కౌన్సిలర్లుగా గెలిచిన వారు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పీఠం కోసం ఇప్పటికే క్యాంపులో ఉన్నారు. దీంతోపాటు పెద్దల అనుగ్రహం కావాలని పార్టీ అగ్రనాయకత్వంను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభపక్ష సమావేశం రోజు, ఆ మరుసటి రోజు పార్టీ ముఖ్యులు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లను కలిశారు. ఇదే రీతిలో జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్ స్థానాలపై కన్నేసిన నాయకులు తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. క్యాంపు రాజకీయాలకు తోడు తమకు ఆశీస్సులు అందించాలని నేతలకు విన్నవించుకుంటున్నారు.

 మీకు అండగా పార్టీ ఉంది..
 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన వారిని టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం సముదాయించే పనిలో పడింది. సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయిన తాజా మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను టీఆర్‌ఎస్ ముఖ్యులు ప్రత్యేకంగా పిలిపించినట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ ఆయనతో మాట్లాడినట్లు తెలంగాణభవన్ వర్గాలు పేర్కొన్నా యి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక న్యాయం చేస్తాం. నామినేటెడ్ పదవుల విషయంలో మీ పేరు మొదటి ప్రాధాన ్యంలో ఉంటుంది అని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ కూడా భరోసా ఇచ్చినట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు.

 మాకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు..
 జిల్లా నుంచి రెండు, మూడో దఫా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు మంత్రిపదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మంత్రిమండలిలో బెర్తు ఖాయమని వారు విశ్వసిస్తున్నారు. ఈ మేరకు పలువురు హైదరాబాద్‌లోనే ఉండి లాబీయింగ్ నడుపుతున్నారు. ఇదిలా ఉంటే భవిష్యత్తులో భర్తీ అయ్యే నామినేటెడ్ పదవుల కోసం కర్చీప్ వేసుకునేందుకు పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటి నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్, డెరైక్టర్ వంటి పదవుల కోసం పైరవీలు మొదలెట్టారు. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో రద్దయిన నామినేటెడ్ పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు తమ వంతుగా ముందస్తు ప్రయత్నం చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement