ఉద్యమకారులకు న్యాయం జరగలేదు | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులకు న్యాయం జరగలేదు

Published Mon, Sep 10 2018 1:15 PM

TRS Leader Ravindra Rao Talk About Telangana Movement Warangal - Sakshi

పాలకుర్తి (వరంగల్‌): తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి పని చేసిన నాయకులకు న్యాయం జరగలేదని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో తక్కెళ్లపల్లి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తొలుత శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ద్విచక్రవాహనాల ర్యాలీతో బృందావన్‌ గార్డెన్స్‌కు చేరుకున్నారు. పబ్బతి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉద్యమ కారులసభలో తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ నా రాజకీయ గురువు ఎన్‌. యతిరాజారావు ఆశీస్సులు తీసుకుని సభకు హాజరయ్యానని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించిన నాయకులు, కార్యకర్తలను ఇతర పార్టీల నుంచి  వచ్చిన నేతలు విస్మరించారని ఆరోపించారు. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందిన దుగ్యాల శ్రీనివాస్‌రావు పార్టీని మోసగించి కాంగ్రెస్‌లో చేరాడని గుర్తు చేశారు. 2009లో పాలకుర్తి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న తనకు అవకాశం ఇవ్వకుండా మహాకూటమిలో భాగంగా టీడీపీలో ఉన్న దయాకర్‌రావుకు ఇచ్చారని అన్నారు. 2014లో ఇతర పార్టీ నుంచి వచ్చిన డాక్టర్‌ సుధాకర్‌రావుకు అవకాశం ఇస్తే ఆయన ఓడిపోయారని తెలిపారు. ఉద్యమకారులకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో సరైన న్యాయం చేయాలని, వారిని కష్టపెట్టొద్దని ఎమ్మెల్యే దయాకర్‌రావు చెప్పారని చెప్పారు.

ఉద్యమకారులకు గుర్తింపునివ్వని ఎమ్మెల్యే
ఉద్యమంలో పని చేసిన నాయకులకు తగిన  గుర్తింపు స్థానిక ఎమ్మెల్యే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గ్రామస్థాయి నుంచి ఉద్యమకారులు ఐక్యమవుతతున్నారని అన్నారు. ఉద్యమ నేతకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రినే కోరడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. మూడు రోజుల్లో ఉద్యమకారులను సంప్రదించి సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. సమావేశంలో సుమారు 3 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సంఘం జిల్లా  నాయకులు సందెల సునీల్, గణగాని రాజేందర్, కాశబోయిన యాకయ్య, ప్రభాకర్, కర్ర రవీందర్‌రెడ్డి, అల్లబాబు, తాళ్లపల్లి నర్సయ్య గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement