పల్లెల్లో ఎల్‌ఈడీ వెలుగులు!

Telangana Plans To Install LED Street Lights In Villages - Sakshi

ఈఈఎస్‌ఎల్‌ సంస్థతో పంచాయతీరాజ్‌శాఖ త్రైపాక్షిక ఒప్పందం

ఏడేళ్లపాటు వీధి దీపాల నిర్వహణ ఆ సంస్థదే

సాక్షి, హైదరాబాద్‌: కరెంటు బిల్లుల భారం తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే పట్టణాల్లో ఎల్‌ఈడీ లైట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం..పల్లెల్లోనూ ఈ దీపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మామూలు వీధి దీపాలను వినియోగిస్తున్న గ్రామ పంచాయతీలు.. ఇకపై తక్కువ విద్యుత్, ఎక్కువ కాంతులు వెదజల్లే ఎల్‌ఈడీ లైట్లతో వెలిగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ ఆదాలో మంచి గుర్తింపు ఉన్న ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈ ఎస్‌ఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 12,753 గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు వీధి దీపాల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడనుంది. ఈఈఎస్‌ఎల్‌తో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని భావించిన పంచాయతీరాజ్‌శాఖ.. ఈ అగ్రిమెంట్‌లో జిల్లా పంచాయ తీ అధికారి, గ్రామ పంచాయతీ, ఈఈఎస్‌ఎల్‌లకు భాగస్వామ్యం కల్పిస్తోంది.

నిధుల్లేకుంటే డీపీవోల ద్వారా సర్దుబాటు
గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధి దీపాలతో కరెంట్‌ బిల్లులు భారీగా రావడమేగాకుండా.. నిర్వహణ కూడా కష్టసాధ్యమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా దీపాల వ్యవస్థను అమలు చేస్తామని ఈఈఎస్‌ఎల్‌ సంస్థ ముందుకు రావడంతో పంచాయతీరాజ్‌శాఖ అటువైపు మొగ్గు చూపింది. ఒప్పందకాలంలో ఎల్‌ఈడీ లైట్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా సంస్థదే. దీపాల బిగింపు, నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను కూడా సంస్థనే చూసుకోవాల్సి ఉంటోంది. నెలవారీ విద్యుత్‌ బిల్లులను స్థానిక పంచాయతీ చెల్లించాల్సి ఉంటుంది

 ఒకవేళ నిధుల కటకటతో చెల్లించలేని పరిస్థితుల్లో జీపీ ఉంటే జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) బిల్లులను సర్దుబాటు చేయాలని పీఆర్‌ శాఖ నిర్దేశించింది. టెండర్లతో సంబంధం లేకుండా.. సంస్థతో అగ్రి మెంటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈఈ ఎస్‌ఎల్‌ సంస్థ పనితీరును మదింపు చేయాలని జీపీలను ఆదేశించింది. నేషనల్‌ లైట్స్‌ కోడ్‌ ప్రమాణాలకు అనుగుణంగా దీపాలను ఏర్పా టు చేశారా? లేదా పరిశీలించాలని నిర్దేశించింది. ఇదిలావుండగా, రాష్ట్రవ్యాప్తంగా అన్నిగ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ పరిశీలనకు పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌లో కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. త్రైపాక్షిక ఒప్పంద పత్రా ల నమూనాను జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం.రఘునందన్‌రావు పంపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top