రెండో విడతా అదే జోరు

Telangana Panchayat Elections Phases Two Medak - Sakshi

నారాయణఖేడ్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నారాయణఖేడ్‌ డివిజన్‌ పరిధిలోని మనూరు, నాగల్‌గిద్ద, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, నారాయణఖేడ్‌ మండలాల పరిధిలోని 190 గ్రామ పంచాయతీలకు సంబంధించి 190 సర్పంచ్, 1,598 వార్డు పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. నారాయణఖేడ్‌ మండలంలో 51 గ్రామ పంచాయతీలు, 440 వార్డులు, మనూరులో 22 పంచాయతీలు, 176 వార్డులు, నాగల్‌గిద్దలో 31 పంచాయతీలు, 248 వార్డులు, కంగ్టిలో 34 పంచాయతీలు, 290 వార్డులు, కల్హేర్‌లో 26 పంచాయతీలు, 224 వార్డులు, సిర్గాపూర్‌లో 26 పంచాయతీలు, 212 వార్డులకు సంబంధించి అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఒక్కో మండలంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు 8 నుంచి 13వరకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డింగ్‌ నిర్వహించారు.

మొదటి రోజు ఉదయం 10.30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5గంటలవరకు కొనసాగింది. మధ్యాహ్నం 12గంటల వరకు మందకొడిగా నామినేషన్లు రాగా మధ్యాహ్నం తర్వాత గ్రామాలు, తండాల నుంచి అభ్యర్థులు, వారి అనుచరులు తరలివచ్చారు. నారాయణఖేడ్‌ మండలానికి సంబంధించి మండల పరిషత్‌ కార్యాలయం, దీని ఆవరణలోని సీఎల్‌ఆర్సీ భవనంలో నామినేషన్లు స్వీకరించారు. మనూరు, కల్హేర్, కంగ్టి ఉమ్మడి మండలాల వారీగా ఆయా మండలాల్లో నామినేషన్లు స్వీకరించారు. ఆయా పదవులకు పోటీచేసే అభ్యర్థులు తమ మద్దతుదారులు, గ్రామస్తులతో కలిసి డప్పుచప్పుళ్లు, బాజాభజంత్రీలు వాయిస్తూ తరలివచ్చారు.

 టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని, కాంగ్రెస్‌ మద్దతుదారులు ఆపార్టీ నాయకుడు నగేష్‌ షెట్కార్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియను ఎంపీడీఓలు, తహసీల్దారులు పర్యవేక్షించారు. గిరిజన మహిళలు నామినేష్ల దాఖలుకు తరలివచ్చి సంప్రదాయ నృత్యాలు చేశారు. యువకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా డివిజన్‌లోని మండల పరిషత్‌ కార్యాలయాల నుంచి అన్ని మార్గాల్లో 100మీటర్ల పరిధిలో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులతోపాటు వారిని ప్రతిపాదించే వారి ని మాత్రమే కార్యాలయ ఆవరణలోకి అనుమతించారు. మిగిలిన వారిని కార్యాలయం బయటే ఉంచారు. గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో పట్టణంలో ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది. హోటళ్లు, టీకొట్లు కిక్కిరిసిపోయాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top