ఇక పుర పోరు! 

Telangana Municipal Corporation Elections Arrangements - Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికలు జూలైలో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో నాయకుల్లో ఆశలు రేకెత్తాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండళ్ల గడువు జూలై 2తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని పంచాయతీ, పార్లమెంటు, జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు ముగియగా.. కేవలం మున్సిపల్‌ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడున్న మున్సిపల్‌ చట్టం స్థానంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త పురపాలక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో పురపాలకశాఖ          
(ఎంఏయూడీ) ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సూచనలతోపాటు ప్రభుత్వం పొందుపర్చనున్న అంశాల నేపథ్యంలో కొత్త మున్సిపల్‌ చట్టం రూపకల్పన పూర్తయితే సకాలంలో ఎన్నికలకు జరగనున్నాయి.

నాయకుల్లో ఉత్సాహం
ప్రజల నుంచి వచ్చిన పురపోరుతో పట్టణాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో ఉత్సాహం నిండనుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బలబలాల అంచనాలపై చర్చలు సాగనున్నాయి. మరో 12 రోజుల్లో మున్సిపాలిటీల పదవీకాలం ముగియనుంది. వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆలోచన నేపథ్యంలో పార్టీలు సైతం ఇందుకు అనుగుణంగా సన్నద్ధం కానున్నాయి. ఇతర జిల్లాలో మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలపై వివాదాలు ఉన్నా ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో విలీన గ్రామాలపై ఎలాంటి వివాదాలు లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎలాంటి సమస్య తలెత్తలేదు. దీంతో శివారు గ్రామాలు కూడా పట్టణంలో కలిసిపోయాయి. దీంతో పురపోరుకు మార్గం సుగమం అయింది.

మొదటి గణన..
బీసీ గణన పూర్తయ్యాకే ప్రక్రియ జరగనుంది. అక్టోబరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా జనాభా గణన చేపట్టినప్పటికీ కోర్టు కేసుల నేపథ్యంలో మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో ప్రక్రియ పూర్తి చేయలేదు. అయా చోట బీసీ గణనను రానున్న పది రోజుల్లో పూర్తి చేయగలిగితే వచ్చే నెలఖారు నాటికి ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఆ తర్వాత వెనువెంటనే రిజర్వేషన్ల ఖరారు, వార్డు విభజన జరిగిపోనున్నాయి. 

వార్డుల పెంపుపై స్పష్టత..
కొత్త పురపాలక చట్టం రూపకల్పన ఇంకా ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం 36 వార్డులు ఉన్నాయి. వాటిని 41 వార్డులకు పెంచాలని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం తీసుకురానున్న కొత్త మున్సిపాలిటీ చట్టంతో ఎన్ని వార్డులు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొత్త చట్టం రూపుదాల్చితేనే వార్డులపై స్పష్టత రానుంది.

పట్టణంలో రాజకీయ వేడి..
కొత్త మున్సిపల్‌ చట్టం వచ్చాకే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో ఆలస్యం జరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ శాసనసభ ద్వారా లేదా ఆర్డినెన్స్‌తో అయినా కొత్త చట్టం తీసుకొచ్చి ఎన్నికలను వచ్చే నెలాఖరు కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం తెలిపారు. దీంతో పట్టణ ప్రాంతంలో రాజకీయవేడి మొదలు కానుంది. పార్టీల కార్యకలాపాలు పెరగనున్నాయి. ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగనున్నారు. తమ వ్యూహాలకు పదును పెట్టనున్నారు.

పునర్విభజనతో మారనున్న హద్దులు..
మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన కీలకం కానుంది. శివారు గ్రామాల విలీనం నేపథ్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే ఇప్పటికీ వార్డుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు భావిస్తున్న చోట పెరిగే అవకాశం ఉందని, మిగతా చోట్ల గ్రామాలు విలీనం అయినా వార్డుల సరిహద్దులు మాత్రం మారనున్నాయి. 

ఉట్నూర్‌ మున్సిపాలిటీపై స్పష్టత కరువు
కొత్త జిల్లాలో ఆదిలాబాద్‌ మాత్రమే మున్సిపాలిటీగా ఉంది. ఉట్నూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేయాలని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసింది. కానీ అధికారంగా మాత్రం గెజిట్‌ విడుదల కాలేదు. ఈ ప్రాంతం నోటిఫై కావడంతో భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ కొనసాగింపు చట్టం ( పెసా), షెడ్యూల్‌ ఏరియా 9 గిరిజనుల ప్రత్యేక హక్కుల ప్రకారం గిరిజనులకు సంబంధించి ఎటువంటి మార్పులు, చేర్పులైనా కేంద్రం ద్వారా జరగాలి. అధికారంగా వస్తేగానీ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఇటీవల ఇక్కడ పంచాయతీలు ఎన్నికలు కూడా జరగలేదు.  

ద్వితీయశ్రేణి   నాయకుల ఆశలు
రిజర్వేషన్ల విషయంలోనూ ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ప్రక్రియపైనే ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఇది వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. రానున్న పురపోరులో ఏ విధమైన ఆలోచన చేస్తారని అంచనాలు వేసుకుంటూనే పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకోనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top