విద్యార్థి తలపై కొట్టిన టీచర్‌

Teacher Beat Student in Private School Hyderabad - Sakshi

కుటుంబ సభ్యుల ఫిర్యాదు

తనపై దాడి చేశారని టీచర్‌ ఫిర్యాదు

ఇరు వర్గాలపై కేసు నమోదు

నాగోలు: ఎల్‌బీనగర్‌ బైరామల్‌గూడలోని ఓ స్కూల్‌లో జరిగిన గొడవపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హస్తినాపురం వెంకటరమణ కాలనీ చెందిన కపిల్‌గౌడ్‌ కుమారుడు సాయి ఇషాన్‌(9) బైరామల్‌గూడలోని పల్లవి అవేర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం క్లాస్‌ రూమ్‌లోకి వచ్చిన డ్రాయింగ్‌ టీచర్‌ శ్రీను నోటుబుక్‌లో పేజీలు ఎందుకు చించావంటూ ఇషాన్‌ తలపై కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబసభ్యులు అతడిని హస్తినాపురంలో నవీన హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థి తండ్రి స్కూల్‌కు వచ్చి టీచర్‌ వైఖరిపై నిలదీయగా స్కూల్‌ యాజమాన్యం అతడి పట్ల దురుసుగా ప్రవర్తించింది. . బాలుడిపై దాడి చేసిన డ్రాయింగ్‌ టీచర్‌తో పాటు స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి తాత వెంకటయ్య ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విద్యార్థి తండ్రి దాడి చేశాడని ఫిర్యాదు..  
కాగా  సాయి ఇషాన్‌ తండ్రి కపిల్‌గౌడ్‌ తతను దుర్భాషలాడటమేగాకుండా దాడి చేశాడని, ప్రిన్సిపాల్, టీచర్లు అడ్డుకున్నా వినకుండా చంపేస్తానంటూ బెదిరించాడని డ్రాయింగ్‌ టీచర్‌ శ్రీను ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top