ఉన్నత విద్యలో తగ్గనున్న సిలబస్‌ | Syllabus to fall in higher education | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యలో తగ్గనున్న సిలబస్‌

Jun 11 2020 6:10 AM | Updated on Jun 11 2020 6:10 AM

Syllabus to fall in higher education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యలో సిలబస్‌ను, పని దినాలను 50 శాతానికి తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆ మార్గదర్శకాలు వచ్చాక పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఉన్నత స్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. బుధవారం సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, జేఎన్‌టీయూ ఇన్‌చార్జి వీసీ జయేశ్‌రంజన్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తదితరులు ఇంజనీరింగ్, ఇతర కాలేజీల యాజమాన్యాలతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే కేంద్రం మార్గదర్శకాలు ముందుగా వస్తే అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని, లేదంటే రాష్ట్రంలో ముందుగా ఆన్‌లైన్‌లో పాఠాలను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని, ఆ తరువాత కరోనా పరిస్థితిని బట్టి ఆఫ్‌లైన్‌ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు విదేశీ విద్యకు, ఉద్యోగాల కోసం వెళ్లాల్సి ఉన్నందున వారికి ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరోవైపు సెప్టెంబర్‌లో కాలేజీలు తెరిచినా హాస్టళ్లు తెరవద్దని, భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుందన్న భావన వ్యక్తమైంది. కాలేజీల ప్రారంభంతోపాటు ఇతర పరీక్షలు, డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబ«ంధించి ఈనెల 15న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో భేటీ కానున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. అవసరమైతే ఆ తరువాత ముఖ్యమంత్రితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement