జీవో 14 ప్రకారం వేతనాలు చెల్లించాలి

Strike Of Contract Workers In Peddapalli - Sakshi

పెద్దపల్లిటౌన్‌ : సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పెద్దపల్లి మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ జేఏసీ పెద్దపల్లి నాయకులు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, జీహెచ్‌ఎంసీలో చెల్లిస్తున్న మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఒకే విధంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం గతంలో సమ్మె చేసినపుడు కార్మికులతో జరిపిన చర్చల్లో జీవో 14 ప్రకారం వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. పలుమార్లు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ తమ సమస్యలను పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని తమకు చాలీ చాలని వేతనాలతో కుటుంబాల పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలు పెంచి, వారిని రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌ కార్మికుల వేతన పెంపుపై మున్సిపాలిటీ తీర్మానం చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేతనాలు చెల్లిస్తామన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఎరవెల్లి ముత్యంరావు, ఆరెపల్లి చంద్రయ్య, సావనపల్లి వెంకటస్వామి, మల్లారపు కొమురయ్య, ఆరెపల్లి సాగర్, శంకర్, వంశీ, గద్దల శ్రీనివాస్, బొంకూరి చంద్రయ్య, మామిడిపల్లి శ్రీనివాస్, సలిగంటి పద్మ, కాదాసి లక్ష్మి, చింతల మరియా తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top