ఆరోగ్యశ్రీనే మిన్న 

State medical services as a role model for the country - Sakshi

దేశానికే రోల్‌ మోడల్‌గా రాష్ట్ర వైద్య సేవలు  

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి 

హైదరాబాద్‌: ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కన్నా మెరుగైన వైద్య సేవలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని 80 లక్షల కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. దీనిపై బీజేపీ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజీ (యూహెచ్‌సీ)ని అమలుపరుస్తూ దేశానికి రాష్ట్రం ఓ రోల్‌ మోడల్‌గా నిలిచిందని కితాబిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశామని వెల్లడించారు. రూ.2 లక్షలకు మించిన వైద్యసేవలను కూడా ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. అవయవ మార్పిడి, డయాలసిస్, కీమోథెరపీ వంటి ఖరీదైన వైద్యాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. లైఫ్‌ సేవింగ్‌ మెడిసిన్‌ పేరుతో అవయవ మార్పిడులు చేసుకున్న వారికి జీవితాంతం మందులు, పరీక్షలు కూడా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. మిగిలిన 20 లక్షల మంది కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథకాలైన ఆరోగ్య భద్రత, ఆర్టీసీ, సింగరేణి, ఈఎస్‌ఐ వంటి పథకాలతోపాటు మిగతా కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.  

25 లక్షల కుటుంబాలకే బీమా.. 
ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాలుగా తోడ్పాటు అందిస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా 25 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య బీమా లభించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 80 లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా అమలులో ఉందన్నారు. ఈ 80 లక్షల కుటుంబాలలో 25 లక్షల కుటుంబాలను గుర్తించి వారికి ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా బీమా అమలు చేసి, మిగతా 55 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా బీమా కల్పించడమన్నది ఆచరణలో ఇబ్బంది కలిగించే విషయమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రారంభించిన తర్వాత సాధ్యాసాధ్యాలను చూసి అమలు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. ఈ నిర్ణయం ప్రజలకు మేలు చేసేదే తప్ప ఎటువంటి హాని తలపెట్టదని స్పష్టం చేశారు. దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని వెల్లడించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top