ఇదే పురిటి గడ్డ

special story on telugu language in telangana - Sakshi

తొలి ప్రక్రియలకు పుట్టినిల్లు తెలంగాణ  

మొదటి కందం నుంచి యక్షగానం దాకా 

తెలుగు+ ఆణెము అనే రెండు పదాలతో ఏర్పడిన పదం తెలంగాణం. ఆణెమంటే దేశమని అర్థం. అతి ప్రాచీన కాలం నుంచి తెలంగాణ ప్రాంతం సాహిత్య రచనా వ్యాసంగానికి నిలయమై విరాజిల్లింది. ఎన్నో ప్రక్రియల్లో తొలి గ్రంథాలు ఇక్కడే పురుడు పోసుకున్నాయంటే సాహిత్యరంగంలో తెలంగాణ ఎంత ప్రముఖమైందో ఊహించుకోవచ్చు.

తొలి గ్రంథం
తెలంగాణకు చెందిన కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాలను రాజధానిగా చేసుకొని శాతవాహనులు ఈ ప్రాంతాన్ని క్రీ.శ. 3వ శతాబ్దం వరకు సుమారు 500 సంవత్సరాలు పాలించినారు. క్రీస్తు శకం 1వ శతాబ్ది నాటికే తెలంగాణలో సాహిత్య రచన ఆరంభమైంది. ప్రపంచ కథా సాహిత్యంలోనే తొలిగ్రంథంగా ప్రశస్తి పొందిన బృహత్కథ కథాకావ్యాన్ని గుణాఢ్యుడు కోటిలింగాల ప్రాంతంలో రచించాడని పండితుల అభిప్రాయం. పైశాచీ భాషలో రాసిన ఈ గ్రంథం మనకు ఇప్పుడు లభ్యం కాకపోయినా కథా సరిత్సాగరం, బృహత్కథా మంజరి మొదలగు గ్రంథాలు ఆ లోటును తీరుస్తున్నాయి.

తొలి సంకలనం
ఈ రోజుల్లో కవితా సంకలనాలు ఎక్కువగా వెలువడుతున్నాయి. ఒకే రచయిత రచనలు కాక వివిధ రచయితల రచనలు ఇందులో చోటు చేసుకుంటాయి. వీటిని సంకలన గ్రంథాలంటారు. ఈ ప్రక్రియకు కూడా తెలంగాణమే ఆది బీజం వేసింది. సుమారు 270 మంది ప్రాకృత కవులు రచించిన ప్రాకృత గాథలను (శ్లోకాలను) శాతవాహన రాజైన హాలుడు గాథాసత్తసఈ (గాథా సప్తశతి) పేరుతో సంకలనం చేశాడు. ఇందులో పిల్ల, అత్త, పొట్ట, కుండ, కరణి, మోడి మొదలైన తెలుగు పదాలు చోటుచేసుకున్నాయి. 

తొలి కందం
జినవల్లభుడు (క్రీ.శ. 940) వేయించిన కుర్క్యాల (కరీంనగర్‌ జిల్లా) శాసనంలో మూడు తెలుగు పద్యాలు కనిపిస్తున్నాయి. ఇవి తెలుగులో రచించిన తొలి కంద పద్యాలు. అందువల్ల కంద పద్యానికి పుట్టినిల్లు తెలంగాణమే అని చెప్పవచ్చు. ఒక పద్యాన్ని గమనించండి.

జిన భవనము లెత్తించుట
జిన పూజల్సేయుచున్కి జినమునులకు న
త్తిన యన్నదానం బీవుట
జినవల్లభు బోలగలరె జిన ధర్మపరుల్‌

తొలి తెలుగు గ్రంథం
11వ శతాబ్దిలో నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతాన్ని తొలి తెలుగు గ్రంథంగా చెప్పుకుంటున్నాం. కానీ తెలంగాణలో అంతకుముందే అంటే 10వ శతాబ్దిలోనే జినవల్లభుని ప్రోత్సాహంతో మల్లియ రేచన ‘కవి జనాశ్రయ’మనే ఛందో గ్రంథాన్ని 113 కందాలలో రచించాడు. ఇందులోనే ఒక కవి స్తుతినీ, సుకవితా లక్షణాలనూ చెప్పడం వల్ల కావ్యాల్లో అవతారికా మార్గం వేసిన మొదటి కవి మల్లియ రేచనే.

తొలి జంటకవులు
జంటకవుల సంప్రదాయం కూడా మొదట ఏర్పడింది తెలంగాణలోనే. కాచ భూపతి, విట్ఠలరాజు అనే కవులు జంటగా రంగనాథ రామాయణంలోని ఉత్తరకాండను రచించారు.

తెలుగులో తొలి వృత్తపద్యం
తెలుగులో లభించిన తొలి వృత్తపద్య శాసనం విరియాల కామసాని శాసనం (క్రీ.శ.1000) వరంగల్‌ జిల్లా గూడూరు గ్రామంలో లభించింది. ఇందులో మూడు చంపకమాలలు, 2 ఉత్పలమాలలు కన్పిస్తాయి.

తొలి సంకలనం
తెలుగులో సంకలన ప్రక్రియకు ఆద్యుడు మడికి సింగన తెలంగాణ ప్రాంతం వాడే. ఈయన  రచించిన సకల నీతి సమ్మతం తెలుగు సంకలన గ్రంథాల్లో మొట్టమొదటిది. ‘ఒక చోట గానబడగ సకల నయ శాస్త్రమతములు సంగ్రహించి గ్రంథమొనరింతు లోకోపకారముగను’ అని గ్రంథ విషయాన్ని పేర్కొన్నాడు.

తొలి వచన సంకీర్తనలు
వచన సంకీర్తన ప్రక్రియలో తొలుతగా సింహగిరి వచనాలను రచించిన కవి తెలంగాణకు చెందిన శ్రీకంఠ కృష్ణమాచార్యులు. ‘స్వామీ! సింహగిరి నరహరీ! నమో నమో దయానిధీ’ మకుటంతో ఈయన నాలుగు లక్షల భక్తి పూరిత వచనాలను రచించినాడని ప్రతీతి. కానీ ప్రస్తుతం 300లోపు గానే లభిస్తున్నాయి.

తొలి పురాణ అనువాదం
సంస్కృతంలోని పురాణాన్ని తొలిసారిగా తెలుగులో అనువాదం చేసిన కవి తెలంగాణకు చెందిన మారన మహాకవి. సంస్కృతంలోని మార్కండేయ పురాణాన్ని కావ్యగుణ శోభితంగా రచించి లె లుగులో తర్వాతి ప్రబంధ కవులకు మార్గదర్శకుడైనాడు.
– ఆచార్య రవ్వా శ్రీహరి

తొలి కల్పిత కావ్యం
తొలి తెలుగు కల్పిత కావ్యానికి కూడా బీజం వేసింది తెలంగాణ ప్రాంతమే. సూరన ధనాభిరామం మొదటి కల్పిత కావ్యం. ధనం ముఖ్యమా? సౌందర్యం ముఖ్యమా? అనే విషయంపై కుబేరుడు, మన్మథుడు వాదించుకోవడం ఇందులో ప్రధాన వస్తువు. కవి రాచకొండ సామ్రాజ్యంలోనివాడు.

తొలి నిరోష్ఠ్య రచన
తెలుగులో మొదటి నిరోష్ఠ్య రచనా, మొదటి అచ్చ తెలుగు నిరోష్ఠ్య రచనా తెలంగాణలోనే ప్రారంభమైంది(అంటే పెదాలతో ఉచ్చరించే ప, బ, మ లాంటి అక్షరాలను మినహాయించి రాసినవి). ఆసూరి మరింగంటి సింగరాచార్యులు దశరథ రాజనందన చరిత్ర అనే నిరోష్ఠ్య కావ్యాన్నీ, సీతా కల్యాణమనే అచ్చ తెలుగు నిరోష్ఠ్య కావ్యాన్నీ రచించాడు.

తొలి వచన రచన, యక్షగానం
తొలి తెలుగు వచన రచనౖయెన ప్రతాపరుద్ర చరిత్ర కూడా తెలంగాణలో వెలసిందే. ఏకామ్రనాథుడు కర్త. ఇది తెలుగు వచన రచనే కాక తొలి చారిత్రక గ్రంథం కూడా. రాయవాచకం కంటే ముందే వచ్చిన రచన. 16వ శతాబ్దికి చెందిన కందుకూరి రుద్రకవి దేవరకొండ తాలూకాలోని జనార్దన కందుకూరి గ్రామ నివాసి అని చారిత్రిక పరిశోధకులు బి.ఎన్‌.శాస్త్రి పేర్కొన్నారు. ఈయన రచించిన సుగ్రీవ విజయం తెలుగులో వచ్చిన మొదటి యక్షగానంగా పేర్కొనవచ్చు.

తొలి బాటలు వేసిన పాల్కురికి
తెలుగులో ద్విపద కావ్యానికి పురుడు పోసింది తెలంగాణయే. వరంగల్లు జిల్లా పాలకుర్తి నివాసి పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం మొదటి ద్విపద కావ్యమే కాక స్వతంత్రమైన తొలి వీరశైవ పురాణం కూడా. సాంఘికాంశాలు చిత్రించిన మొదటి సాంఘిక కావ్యంగా కూడా దీనికి ప్రసిద్ధి ఉంది. మకుట నియమం, సంఖ్యా నియమం శతకాలలో మొదటిదైన వృషాధిప శతకం కూడా తెలంగాణలో వెలువడిందే. పాల్కురికి సోమనాథుడే 108 చంపకోత్పల మాలికలతో రచించిన ఈ శతకం తర్వాతి కవులకెందరికో మార్గదర్శకమైంది. తెలుగు, సంస్కృతం, కన్నడ భాషల్లో విశిష్టమైన రచనలు చేసిన ప్రతిభామూర్తుల్లో కూడా సోమనాథుడు ఆద్యుడే. ఆయన పండితారాధ్య చరిత్ర లె లుగులో మొదటి విజ్ఞాన సర్వస్వంగా భావించవచ్చు. ఉదాహరణ, రగడ ప్రక్రియల్లోనూ ఆయన గ్రంథాలే తొలి రచనలు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top