మట్టి పరిమళం సుద్దాల..

Special Story On suddala Ashok teja - Sakshi

జనం నోట పాటైన తండ్రీకొడుకులు

జానపదం..శ్రమ సంస్కృతికి పాటతో పట్టం

హనుమంతు వారసత్వపుపాట అశోక్‌తేజ

ఎంగిలివారంగ పాటతోనే ఆ ఇంట పొద్దుపొడుపు. ఇంట్లో పని చేసుకుంటూ అమ్మ పాడేది.. తన పనులు చేసుకుంటూ నాన్న పాడేవారు.. పిల్లలు శ్రుతులు, రాగాలయ్యేది. వచ్చేటోళ్లు పాటలై వొస్తరో.. పాటల కోసమే వస్తరో కానీ.. చేతులతోని దరువేసే వాళ్లు, బుర్రలు వాయించేవాళ్లు.. తాళం కొట్టేవాళ్లు.. దీనికి నాన్న చేతిలోని హార్మోనియం తోడై రాగమందుకుంటే.. ఆ ఇల్లు పాటకు పుట్టినిల్లయ్యేది. అదే సుద్దాలలోని సుద్దాల హనుమంతు ఇల్లు.

కదిలించే గీతాలు..భావాలు
అశోక్‌తేజ రాసిన ‘ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం’ గొప్ప అనుకూల ఆలోచన కలిగించే పాట. ఎందరికో ధ్యేయాన్ని అందించిన పాట. ఆయన స్త్రీకి ఇచ్చిన గౌరవమే పనిపాటలకిచ్చి పాటలు కట్టిండు. పనినొక సంస్కృతి జేసిన ఘనత కష్టజీవిది. ‘టప, టప, టప, టప, టప, టప చెమటబొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే’ అనే పాట పనితో పాటే పుట్టింది. పని–పాటతో జతకట్టింది అనే పాట ఇటీవల అశోక్‌తేజ రాసిన శ్రమకావ్యానికి మూలభూతాలు, టపటపటప, పరికరాలు పుట్టించిన పాటలు ఎందరినోళ్లల్ల పండిన పాటలు. అశోక్‌తేజ ‘శ్రమకావ్యా’న్ని రచించిన తీరు కొత్తది. ఈ కావ్యంలో శ్రమీ, శ్రములు (శ్రమ యొక్క స్త్రీ, పురుష కాల్పనిక పాత్రలు) పాత్రధారులు. ఈ రచనను ‘శ్రమహాకావ్యం’ అని, కవిని ‘శ్రమహాకవి’ అని అన్నారు దీనికి ముందు మాట రాసిన రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి.

ఆ ఇంట పాటతోనే పొద్దుపొడుపు
పాటతోటి ఉద్యమానికి బాటకట్టిన ప్రజాకవి సుద్దాల హనుమంతు. పాటంటే ఆయన గుండెలోంచి ఉబికి వచ్చే సెల. తాను పుట్టిన పాలడుగులో హరికథకుడు, ఆధ్యాత్మిక గురువు అంజయ్య శిష్యరికంలో ఆయన కళాకారుడిగా ఎదిగాడు. మంచి గొంతు.. ధ్వన్యనుకరణలో దిట్ట. అద్భుతంగా హార్మోనియం వాయిస్తూ తను పాడుతుంటే.. విన్నవాళ్లదే భాగ్యం. సొంతగా పాట కట్టేవాడు. నటన, వాద్య, గానాలబ్బిన ఆయన తొలిసారి తన ఊళ్లో కంటబడ్డ వెట్టి పాపయ్య దుఃఖాన్ని మనసు మీదికి తీసుకుని– ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న.. ఎంత చెప్పినా తీరదో కూలన్న..’ అనే పాటకట్టిండు. నైజాం పాలన అంతమైనాక సుద్దాలకు చేరుకున్న హనుమంతు వారసత్వంగా వచ్చిన ఆయుర్వేద వైద్యవృత్తిని చేపట్టాడు. దాంతోపాటే సాంస్కృతిక సేనానిగా కొనసాగాడు. తనతో తన భార్య జానకమ్మ సమవుజ్జీనే. పిల్లలు పిల్లపాటలు. భారతి గొంతెత్తి పాట పాడుతుంటే హనుమంతు భావుకత్వంతో తన్మయుడయ్యే వారు.

ఆ నోట జనం పాట..
సుద్దాల అశోక్‌ తేజ.. హనుమంతు పెద్దకొడుకు. మరో ఇద్దరు కొడుకులు ప్రభాకర్, సుధాకర్‌. బిడ్డ భారతి. పిల్లలకు ఇంట్లో విన్న పాటలన్నీ కంఠో‘పాట’మే. సుద్దాల హనుమంతు.. ‘పల్లెటూరి పిల్లగాడ..’ పాటతో ప్రసిద్ధుడు. పసులుకాసే పిల్ల గాని ఆర్తిని, బాధను పాటగా కట్టిన వాగ్గేయకారుడాయన. తండ్రికి తగ్గట్టే అశోక్‌తేజ– ‘కన్నతల్లీ మమ్ముల కన్నప్పటి నుంచీ కడుపునిండా తినలేదు మెతుకు.. కింటినిండ కనలేదు కునుకు..’ అంటూ బతుకుపాట కట్టాడు. ఇందులోనే– ‘యజమాని ముప్పయి పసులమందను నేను అజుమాయించకపోతి ఆరేండ్లపోరణ్ణి.. ఒక పెయ్య దప్పించుకుపొయ్యి ఆముదపుచేండ్ల ఆకులు రెండూ మేసి నామొచ్చిపడిపోతే, ఇనుపచువ్వలు కాల్చి నా ఈపూల గుంజీరి’ అనడం ద్వారా తండ్రి పాటకు కొడుకు కొనసాగింపనిపిస్తుంది. ఇది పాట వారసత్వం. అశోక్‌తేజ చదువుల కోసం హైదరాబాద్‌ చేరి.. అక్కడి జీవితానుభవాలను పాటలుగా కట్టి పాడాడు. ఆయన పాటల్లో ఎన్నదగినది.. ‘రాయి, సలాక, ఇసుక, ఇటుక, తాపీ, తట్ట గోడ మీద గోడ, మేడ మీద మేడ, కట్టిపోరా కూలోడా’. ఈ పాటలో ఇండ్లు కట్టే కూలోల్ల బతుకుబొమ్మను సజీవంగా చిత్రించారు.

జనగీతాలు..
తండ్రివేసిన పాటల బాటలో తన  పాటల బండిని తోలుకుంటూ వచ్చిండు అశోక్‌తేజ. ఆయన పాటల్లో కవిత్వముంటది. కానీ తన సినీగేయాల్లో కొన్నింటిలోనే కవిత్వముంటుంది. చిత్రమేమిటంటే అశోకన్న తనుగా రాసుకున్న పాటల్లో చాలామట్టుకు సినిమాల్లో వచ్చుడు విశేషం. ‘నీకు మచ్చాలేడా లేసేలువలే లేవులే’’ ఈ పాట ఎంత ప్రజాదరణ పొందిందో!. ఇందులో  రైతును చందమామతో పోల్చి చెప్పే అలంకారీయత ఉంది. తన పాటల్లో రూపకాలను ఎక్కువగా వాడతారు అశోక్‌తేజ. తను రాసిన పాట ‘అడివమ్మ మాయమ్మ అతిపేదదీరా, ఆ యమ్మకున్నది ఒక్కటే చీరా, ఆ చీర రంగేమొ ఆకుపచ్చనిది, ఆ తల్లి మనసేమొ రామసక్కనిదీ ఆకలైతె చెట్టు అమ్మయితది.. ఆయుధాలడిగితే జమ్మిచెట్టయితది..’ అసాధారణ భావాల గీతమిది.  

‘ఆమె’కు పాటతో పట్టాభిషేకం..
అశోక్‌తేజ ‘ఆడదాన్నిరో నేను ఆడదాన్నిరో నేను ఈడ ఎవనికి కానిదాన్ని ఏడిదాన్నిరా’ అనే పాట రాసిండు. ఆయన గురించి పాపినేని శివశంకర్‌ ‘స్త్రీ హృదయమున్న పురుషకవి’ అన్నారు. హనుమంతు కొంతవరకు రాసి వదిలివెళ్లిన వీర తెలంగాణ యక్షగానాన్ని పూరించారు అశోక్‌తేజ. దాని కోసం ఎంతో సాధన చేశారు. ‘పుల్లాలమంటివి కదరా.. ఇదిగో పులిపిల్లాలమై వచ్చితిమి గనరా’,  ‘ఇంతీ ఏ యింటిదానివే’ అనే పాటలు ఆ వరుసలోనివే. ‘ఆలి నీకు దండమే. అర్ధాంగి దండమే. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం..’ ఈ పాటలొక్కొక్కటే స్త్రీ హృదయాన్ని గౌరవించే ఆణిముత్యాలైన కవితా గీతాలు.

పాటమ్మా.. నీకు వందనాలమ్మా..
‘నేలమ్మ.. నీకు వేనవేల వందనాలమ్మా’.. ఈ నేలను ఇంత గొప్పపాటగా ఎవరు మలచగలిగారు? భూమిని తల్లిగా భావించి కీర్తించిన కవులెందరున్నా.. ఇట్ల నేలను వర్ణించిన కవి కానరాడు మనకు. ‘సాలేటి వానకే తుళ్లింత ఇంక సాలు, సాలుకు నువ్వు బాలింత.. ఇంత వానకే పులకరించిపోయిన భూమి, విత్తులు చల్లిన సాలు, సాలుకు బా లింత అవుతుంది. నేలమ్మవుతుంది..’ ఇదీ అశోక్‌ తేజ నేలమ్మను దర్శించిన వెలువరించిన తత్వం. తన ఒంటిమీద బిడ్డల చితులు కాల్చుకున్న తల్లెవరన్న వుంటరా? నేలమ్మను కవి ఊహ చేయడంలో ఒక ప్రత్యేక కవిత్వ
శిల్పముంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top