ఇంటికొకరికి.. బీమారు

Siddipet Dharmavaram Villagers Problems With Fevers - Sakshi

అక్కన్నపేట(హుస్నాబాద్‌) : అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామం మంచం పట్టింది. గత రెండు మూడు వారాలుగా గ్రామ ప్రజలు జ్వరాలతో అల్లాడిపోతున్నారు. గ్రామంలో మొత్తం 1200 మంది జనాభా ఉండగా.. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతూ మంచం పట్టారు. కొన్ని ఇళ్లలో కుటుంబం మొత్తం మంచం పట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. తీవ్రవైన ఒళ్లు నొప్పులతో మంచం దిగలేని స్థితిలో ఉన్నామని జ్వర పీడితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు కొద్దిరోజులుగా హుస్నాబాద్, కరీంనగర్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మరికొంతమంది స్థానిక ఆర్‌ఎంపీలతో చికిత్స పొందుతూ... ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు.

50 మందికి పైగానే...
ప్రస్తుతం గ్రామంలో 50మందికి పైగానే జ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఆస్పత్రుల్లో వైద్యం పొంది ఇంటికి వచ్చారు. వీరితో పాటు గ్రామంలో చాలా వరకు ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు.

ఊరికి రావొద్దంటూ ఫోన్లు...
ఊరు ఊరంతా జ్వరంతో బాధ పడుతుండడంతో బంధువులు, హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న పిల్లలను ధర్మారంకి రావొద్దని గ్రామస్తులు ఫోన్లు చేస్తున్నారు. కొత్త వారెవరైనా వస్తే వారికి కూడా జ్వరం సోకుతుందేమోనన్న భయంతో ఊళ్లోకి రావొద్దని వేడుకుంటున్నారు.

ఆసుపత్రికి రూ.10 వేలు ఖర్చయింది  
ఐదారు రోజులు ఇంటికాడ మంచానికే పరిమితమయ్యా. చివరికి ప్రైవేటు ఆసుత్రిల్లో చేరి రూ.10వేలు ఖర్చు చేస్తే కొంచెం నయమైంది. ఆసుపత్రిలో రక్త, మూత్ర పరీక్షలతోపాటు మరికొన్ని పరీక్షలు చేశారు. సీజన్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామంలో హెల్త్‌ క్యాంపులు నిర్వహించాలి.
– కొమ్ముల విజయ్, గౌరవెల్లి

పారిశుధ్యలోపం...
గ్రామంలోని డ్రైనేజీల్లో చెత్తా చెదారం పెరిగిపోయి దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గ్రామ పంచాయతీ ద్వారా స్థానికులకు తాగునీటి సరఫరా చేసే ట్యాంకును శుభ్రం చేయడం లేదు. చాలారోజులుగా మంచినీటి ట్యాంకులో క్లోరినేషన్‌ చేయడం లేదు. గ్రామస్తుల్లో ఎక్కువ మంది వాటర్‌ ప్లాంట్‌లోని నీటినే తాగుతున్నప్పటికీ ట్యాంకులోని నీటిని తాగిన కొద్దిమందికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురువుతున్నాయి. గ్రామంలోని పలు కాలనీలల్లో నీటి నిల్వ ఉండడంతో దోమల లార్వాలు ఎదుగుతున్నాయి.

పనులన్నీ బంద్‌...
మలేరియా, టైఫాయిడ్‌లు విజృంభిస్తుండటంతో గ్రామంలో సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదవారు కూడా జ్వరాలతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఒళ్లునొప్పులు, నీరసంతో ఆపసోపాలు పడుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. పేదవారు స్థానికంగానే ఆర్‌ఎంపీని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వైద్యశిబిరాల జాడే లేదు...
డివిజన్‌లోని దాదాపు అన్ని గ్రామాల్లో జ్వరాలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ.. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరించి డెంగీనా, సాధారణ జ్వరాలా అని తేల్చాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో సిబ్బంది కొరత ఉండి శిబిరాలు నిర్వహించడం లేదని వైధ్యాధికారులు చెబుతున్నారు.    

హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలి
గ్రామంలో విషజ్వరాలు ప్రబలిన మాట వాస్తవమే. అందరూ చికిత్స కోసం కరీంనగర్, హు స్నాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు పోతున్నారు. దీంతో పొలం పనులు, ఇంటి పనులకు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే మెడికల్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేయాలి.  – సిరిసిల్ల బాలరాజు, మాజీ సర్పంచ్‌ ధర్మారం

వైరల్‌ ఫీవర్లు ఉన్నాయి
డెంగీ జ్వరాలు ఎక్కువగా లేవు. దాదాపు అన్ని వైరల్‌ జ్వరాలే. ప్రభుత్వ సంస్థల నుంచి నిర్ధారణ జరిగితే డెంగీగా పేర్కొనవచ్చు. అవసరమున్న చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. 
– సౌమ్య, ప్రభుత్వ వైద్యాధికారి, హుస్నాబాద్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top