నల్లగొండ పురపీఠం హస్తగతం | second day postponed election | Sakshi
Sakshi News home page

నల్లగొండ పురపీఠం హస్తగతం

Jul 5 2014 5:18 AM | Updated on Mar 18 2019 7:55 PM

నల్లగొండ పురపీఠం హస్తగతం - Sakshi

నల్లగొండ పురపీఠం హస్తగతం

నల్లగొండ మున్సిపాలిటీని కాం గ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

- రెండో రోజూ వాయిదా పడిన సూర్యాపేట ఎన్నిక
- అదేదారిలో మిర్యాలగూడ వైస్‌చైర్మన్....

 నల్లగొండ టుటౌన్: నల్లగొండ మున్సిపాలిటీని కాం గ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం 11గంటలకు విపక్ష పార్టీల కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశ మందిరంలోకి చేరుకోగా కాంగ్రెస్ కౌన్సిలర్లు 22 మంది స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి 11.30వచ్చారు.

అనంతరం తెలుగు అక్షరమాల ప్రకారం కౌన్సిలర్లతో నల్లగొండ ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జహీర్ ప్రమాణం చేయించారు. అంతకు ముందే కాంగ్రెస్, విపక్షాల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి అందజేశారు. ప్రమాణ స్వీకా రం చేసిన అనంతరం ఎన్నికల అధికారి మొదట విపక్ష కూటమి నుంచి చైర్మన్ అభ్యర్థిని ప్రతిపాధించాలని కోరారు. దీంతో 40వ వార్డు నుంచి గెలిచిన కౌన్సిలర్ గున్‌రెడ్డి రాధికను ప్రతిపాదించగా 18మంది మద్దతు తెలిపారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 36వ వార్డు కౌన్సిలర్ ఎం.నవీన్‌కుమార్ బొడ్డుపల్లి లక్ష్మిని ప్రతిపాధించగా 29వ వార్డు కౌన్సిలర్ ఎ.ప్రదీప్‌నాయక్ బలపర్చారు. ఆమెకు 22 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతు పలికారు. దీంతో ఎన్నికల అధికారి బొడ్డుపల్లి లక్ష్మి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.

అనంతరం వైఎస్ చైర్మన్ ఎన్నికకు అభ్యర్థి నూకల వెంకట్‌నారాయణరెడ్డిని ప్రతి పాధించాలని ఎన్నికల అధికారి కోరగా ఎవరూ స్పందించలేదు. ఆ తరువాత కాంగ్రెస్ నుంచి వైస్ చైర్మన్ అభ్యర్థిని ప్రతిపాధించి, బలపర్చాలని కోరగా 37వ వార్డు కౌనిల్సర్ ఖయ్యుంబేగ్ 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని ప్రతిపాధించారు. 35వ వార్డు కౌన్సిలరు దుబ్బ అశోక్‌సుందర్ బలపర్చారు. శ్రీనివాస్‌రెడ్డికి 22మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే మద్దతు తెలిపారు.

ఆ తరువాత సీపీఎం నుంచి వైస్ చైర్మన్ అభ్యర్థిగా ఎండి.సలీంను అదే పార్టీ కౌన్సిలర్ ఎ.రవీందర్ ప్రతిపాధించగా, టీడీపీ 20వ వార్డు కౌన్సిలర్ మోహిన్ బలపర్చారు. ఆయనకు మద్దతుగా 18 మంది చేతులు ఎత్తారు. దీంతో అధిక మంది కౌన్సిలర్ల మద్దతు పొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి జహీర్ ప్రకటించారు. ఆ తరువాత చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఎన్నిక ధువీకరణ పత్రాలు అందజేశారు. చైర్‌పర్సన్‌గా ఎన్నికైన లక్ష్మితో పాటు వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement