అభయం | Sakshi
Sakshi News home page

అభయం

Published Mon, Jan 5 2015 3:39 AM

Salvation

అభయహస్తం పింఛన్ల పంపిణీలో గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పింఛన్లను జనవరి రెండో వారం నుంచి పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలందడంతో జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
ముకరంపుర : జిల్లాలో 41,603 మంది లబ్ధిదారులకు నెలనెలా రూ.500 అందించేవారు. నెలకు రూ.2.08 కోట్లు అవసరమయ్యేవి. ఆసరా పింఛన్లతో ముడిపెట్టడంతో అక్టోబర్ నుంచి అభయహస్తం పింఛన్లు నిలిచిపోయాయి. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు రోజుకు రూపాయి చొప్పున ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో ప్రీమియం చెల్లిస్తుంది.

ఇలా 60 ఏళ్లు నిండే వరకు సభ్యులు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు పూర్తయ్యాక సభ్యులకు నెలకు రూ.500 నుంచి రూ.2200 వరకు పింఛన్ అందిస్తారు. దీనికి ప్రమాదబీమా సౌకర్యం కల్పించారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తారు.

ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున ఆసరా పేరిట అక్టోబర్ నుంచి అందిస్తోంది. ఆసరా పింఛన్ల లబ్ధిదారులు అభయహస్తంలోనూ ఉన్నారని విచారణ పేరిట వీరికి మూడు నెలలుగా పింఛన్లు ఇవ్వడం లేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

ఎంతమందికో అభయ‘హస్తం’
అభయహస్తంలో పింఛన్లు పొందుతూ 65 ఏళ్ల వయసున్న పలువురు ఆసరా పింఛన్లకోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు పరిశీలించి మంజూరు కూడా చేశారు. అసరా పింఛన్ వచ్చే వారికి అభయహస్తం పెన్షన్ రద్దు చేస్తారు. ఇలాంటివారి సంఖ్య తేల్చేందుకే ఇంతకాలం విచారణ చేశారు. ‘ఆసరా’ లబ్ధిదారులు లెక్కతేలడం, వారికి పంపిణీ కూడా మొదలవడంతో వీరిలో అభయహస్తం లబ్ధిదారులు ఎందరున్నారో త్వరగానే తేలనుంది.

వీరి జాబితా సిద్ధం చేసి పింఛన్లు అందించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలివ్వడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాబితా సిద్ధమయ్యాక జనవరి 15 నుంచి అభయహస్తం పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పింఛన్ మొత్తం పెంచాలని యోచించినా... చివరకు పాత పద్ధతిలోనే నెలకు రూ.500 చొప్పున పంపిణీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల పింఛన్ మొత్తం రూ.1500 లబ్ధిదారులు ఒకేసారి అందుకోనున్నారు.
 
అభయహస్తం, పింఛన్ల పంపిణీ, అధికారులు,
Assurances, the distribution of pensions, the

Advertisement

తప్పక చదవండి

Advertisement