ఆర్టీసీ కార్మికుల పోరాటం.. తీరని విషాదం

RTC Driver Dies of Heart Attack in Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌/ సంగారెడ్డి : అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించినప్పటికీ ప్రభుత్వం విధుల్లోకి చేర్చుకునేందుకు నిరాకరించడంతో తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సమస్యలు పరిష్కరించాలని సమ్మెలోకి వెళ్లినందుకు ఇప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు తమను విధుల్లోకి చేర్చుకోవాలని వేడుకుంటున్నారు. ఉద్యోగం కోసం కంటతడి పెడుతూ.. కార్మికులు పలుచోట్ల ప్రభుత్వాన్ని, అధికారులను ప్రాధేయపడుతున్నారు. డిపోల మందు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేందర్ (55) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమ్మె విరమించినా ప్రభుత్వం తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో రాజేందర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని, గుండెపోటుతో రాజేందర్‌ మృతి చెందారని కార్మికులు తెలిపారు. రాజేందర్‌ది నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం మంగల్‌పాడ్ గ్రామం.

నురగలు కక్కుతూ పడిపోయిన ఆర్టీసీ కార్మికుడు
సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్‌లోనూ విషాద ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న భీమ్లా మంగళవారం ఉదయం తిరిగి విధుల్లోకి చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చాడు. అయితే, అతన్ని విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులు భీమ్లాను అరెస్టు చేసి.. ఇంద్రకరణ్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భీమ్లా నురగలు కక్కుతూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో ఆయనను తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో భీమ్లాకు గుండెపోటు వచ్చిందని తోటి కార్మికులు తెలిపారు.

మేనేజర్ కాళ్ళు మొక్కిన కార్మికులు
విధుల్లో చేరేందుకు నిజామాబాద్ డిపో 1కు ఆర్టీసీ కార్మికులు మంగళవారం భారీగా తరలివచ్చారు. తమను విధుల్లో చేర్చుకోవాలని డిపో మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అయితే, వారిని విధుల్లోకి చేర్చుకోలేమని డిపో మేనేజర్ తేల్చి చెప్పారు. దీంతో ఆందోళన చెందిన కార్మికులు మేనేజర్ కాళ్ళు మొక్కి డ్యూటీలో చేర్చుకోవాలని వేడుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top