
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం నుంచి పోలీసు శాఖకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూవస్తోంది. తాజా బడ్జెట్‌లో హోంశాఖకు రూ.4,540 కోట్ల నిధులు కేటాయించింది. అయితే గతేడాది కంటే ఈ సారి బడ్జెట్‌లో భద్రతకు రూ.1,250 కోట్ల మేర కేటాయింపులు తగ్గడం గమనార్హం. గస్తీకి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఇప్పటికే వేలాదిగా వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చింది. ఇందులో 2014లో 3,800, 2018లో 11,500 వాహనాలు ఆ శాఖకు అందజేసింది. నాలుగున్నరేళ్లలో దాదాపుగా 15 వేల వాహనాలు (ఇందులో ఇన్నోవాలు, బస్సులు, బైకులు తదితరాలు) సమకూర్చింది. హైదరాబాద్ వ్యాప్తంగా 5 లక్షల సీసీ కెమెరాలు అమర్చింది. దశలవారీగా ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా విస్తరించే యోచనలో ఉంది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ఉంది. వాస్తవానికి ఈ నిర్మాణాన్ని డిసెంబర్‌లోనే ప్రారంభిస్తారని వార్తలు వచ్చినా.. అది సాకారం కాలేదు. ఇటీవల రాచకొండ కమిషనరేట్ నూతన భవనాన్ని రూ.5.1 కోట్లతో పూర్తిచేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన కొత్త కమిషనరేట్లు సిద్దిపేట, రామగుండం నిర్మాణం కూడా వేగం పుంజుకుంది. నూతనంగా ఏర్పడిన 21 జిల్లాలతోపాటు ఇటీవల కొత్తగా ఆవిర్భవించిన ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలు, కొత్త మండలాల్లో మోడల్ పోలీస్ స్టేషన్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన 18,000 పోస్టుల భర్తీ చేపడితే పోలీసులపై పనిభారం కొంతమేర తగ్గనుంది.