టీచర్ల బదిలీల్లో అవే తప్పులు...!

Regularly missing seniority list on website - Sakshi

  వెబ్‌సైట్‌లో క్రమపద్ధతిలో కనిపించని సీనియారిటీ జాబితా

  ప్రింట్‌అవుట్, డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఇవ్వని విద్యాశాఖ

  నేటితో ముగియనున్న అభ్యంతరాల గడువు  

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ వెల్లడించిన సీనియారిటీ జాబితా గందరగోళంగా మారింది. ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్ల కేటాయింపులో పొరపాటు దొర్లడంతో జాబితాలో పేర్లు తారుమారయ్యాయి. బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల ప్రాథమిక సీనియారిటీ జాబితాను విద్యాశాఖ శుక్రవారం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో సీనియారిటీని చూసుకున్న పలువురు ఉపాధ్యాయులు తమ పాయింట్లను చూసుకుని కంగుతిన్నారు. జాబితాలో జూనియర్లు పైవరుసకు వెళ్లడంతో సీనియర్లు విద్యాశాఖకు భారీగా ఫిర్యాదులు చేశారు. ప్రాథమిక జాబితాపై ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి సరిదిద్దే వెసులుబాటు ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో ఆ ప్రక్రియ మరింత జటిలంగా మారింది.

తాజాగా ప్రవేశపెట్టిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం లేదు. జాబితాలో ఒకసారి వంద మంది పేర్లను మాత్రమే చూసే అవకాశం ఉంది. దీంతో ఎవరైనా ఉపాధ్యాయుడు జాబితాలో తన పేరును చూసుకోవాలంటే ప్రతి పేజీని తప్పకుండా చూడాల్సి వస్తోంది. మరోవైపు తప్పొప్పులు సవరిస్తున్న క్రమంలో జాబితాలో పేర్లు గంటగంటకూ తారుమారవుతున్నాయి. ఈ ప్రక్రియ ఉపాధ్యాయులకు చికాకు తెస్తోంది. మరోవైపు జాబితాను ప్రింట్‌అవుట్‌ తీసుకునే వీల్లేకపోవడంతో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సరైన ఆధారాలు సమర్పించే అవకాశం లేదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. 

నేటితో అభ్యంతరాలకు తెర... 
ఉపాధ్యాయులకు సర్వీసు కాలానికి ఇచ్చే పాయింట్లలో తప్పులు దొర్లినట్లు టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్‌జిల్లా బదిలీలపై వచ్చిన వారికి జీరో సర్వీసును పరిగణించకుండా పూర్వ జిల్లాలో పనిచేసిన కాలానికి పాయింట్లు ఇస్తున్నట్లు టీచర్లు విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే స్కూళ్ల కేటగిరీని నిర్దేశించడంలో పొరపాట్లు జరిగినట్లు పలువురు టీచర్లు డీఈవోలకు లిఖితపూర్వకంగా వినతులు సమర్పించారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాల విషయంలోనూ జీహెచ్‌ఎంలతో కుమ్మక్కై టీచర్లు అధిక పాయింట్లు పొందుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే వాటిని ఆమోదిస్తున్నారని, స్పౌజ్‌ పాయింట్ల విషయంలో సర్వీసు పుస్తకాలను వెరిఫై చేయకుండా పచ్చజెండా ఊపుతున్నట్లు టీచర్లు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ జాబితా, పాయింట్ల కేటాయింపుపై అభ్యంతరాల స్వీకరణ ఆదివారంతో ముగియనుంది. టీచర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత మంగళవారం తుది జాబితాను విద్యాశాఖ ప్రకటించనుంది. 

అవార్డులు వెనక్కు...! 
జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిన టీచర్లకు గతంలో బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చేది. తా జాగా అలాంటి వారికి, రాష్ట్ర, జిల్లా స్థాయి రిసోర్స్‌ పర్సన్లకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనితీరుకు గుర్తింపుగా అవార్డులు ఇచ్చి ఇప్పుడు గౌరవం ఇవ్వడం లేదని పలువురు అవార్డుగ్రహీతలు విద్యాశాఖ వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ విద్యాశాఖ వారి వినతిని పరిగణించలేదు. దీంతో తాజాగా అవార్డులు తిరిగిచ్చేయాలని కొందరు భావిస్తున్నారు. సందర్భాన్ని బట్టి అవార్డులను ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తామని ఇటీవల రాష్ట్రస్థాయి పురస్కారం తీసుకున్న ఉపాధ్యాయుడు ఒకరు ‘సాక్షి’తో అన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top