కమీషన్‌ ‘సగమే’నా..!

Ration Dealers Commission Adilabad - Sakshi

ఆదిలాబాద్‌ మండలం రామాయి గ్రామ రేషన్‌ డీలర్‌ వినోద్‌ చౌదరి ప్రతీ నెల 475 కార్డులకు బియ్యం పంపిణీ చేస్తాడు. 2015 అక్టోబర్‌ నుంచి 2018 ఆగస్టు వరకు 3,395 క్వింటాళ్ల బియ్యాన్ని కార్డుదారులకు అందజేశాడు. జాతీయ ఆహార భద్రత చట్టం–2015 ప్రకారం క్వింటాల్‌కు రూ.50 చొప్పున, ఒక్కో కార్డు ట్రాన్సక్షన్‌కు రూ.17 చొప్పున కమీషన్‌ను కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. ఈ లెక్కన ఆయనకు మూడేళ్ల కమీషన్‌ రూ.1,69,765 రావాలి. కానీ నెల క్రితం రూ.76,765 చెక్‌ను ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. మిగతా రూ.93,000 చెల్లించాల్సి ఉన్నా.. ప్రభుత్వాల నుంచి స్పష్టత లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నాడు. అంటే ఆయనకు కమీషన్‌ సగమే ఇచ్చారని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.

ఆదిలాబాద్‌అర్బన్‌: నెల రోజుల క్రితం రేషన్‌ డీలర్లకు చెల్లించిన బకాయిలపై తిరకాసు మొదలైంది. ప్రభుత్వాలు చెల్లించింది పూర్తి కమీషనా..? లేక సగమేనా..? అనేది తెలియక డీలర్లలో గందరగోళం నెలకొంది. ట్రాన్సక్షన్‌ ప్రకారం డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్‌ మొత్తం చెల్లించామని, లేక సగమే ఇచ్చామని అటు కేంద్ర ప్రభుత్వం గానీ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పష్టతనివ్వకపోవడంతో వారిని అయోమయానికి గురిచేస్తోంది. ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం కమీషన్‌ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా జవాబు దొరకడం లేదు. కాగా, కేంద్రం నుంచి ఎంత కమీషన్‌ వచ్చిందో అంతే మొత్తాన్ని డీలర్లకు అందజేశామని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారులు పేర్కొనడంతో డీలర్లు అయోమయంలో పడ్డారు. బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సంతోషపడిన డీలర్లు తమకు వచ్చిన చెక్కులతో కంగుతిన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నగదు నిర్ణయించడం, ఏ లెక్కన కమీషన్‌ ఇచ్చారో స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
కమీషన్‌ రూ.25కు మించి రాలేదా..?
జాతీయ ఆహార భద్రత చట్టం–2015 అమల్లోకి రాకముందు కిలోకు రూ.20 పైసల చొప్పున క్వింటాల్‌కు రూ.20 డీలర్లకు కమీషన్‌ వస్తుండేది. చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కమీషన్‌ రూ.70కి పెరిగింది. ఈ లెక్కన ప్రతి క్వింటాల్‌కు రూ.70 చొప్పున ప్రభుత్వాలు కమీషన్‌ ఇవ్వాలి. ఇందులో కేంద్రం ప్రభుత్వం రూ.35 చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.35 చెల్లించాలి.  అయితే 2015 అక్టోబర్‌ నుంచి 2018 ఆగస్టు వరకు ప్రభుత్వాల నుంచి డీలర్లకు కమీషన్‌ రావాల్సి ఉంది. ఇదీ కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఒక్కో కార్డు ట్రాన్సక్షన్‌ చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.17 అదనంగా ఇస్తోంది. జిల్లాలో 355 మంది రేషన్‌ డీలర్లు ఉన్నారు. వీరందరికీ 35 నెలలకు సంబంధించిన కమీషన్‌ బకాయిలు సుమారు రూ.14.74 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, ఇందులో నుంచి గత నెలలో రూ.6.74 కోట్లు విడుదల చేశారు. ఇంకా దాదాపు రూ.8 కోట్లు రావాల్సి ఉంది. అంటే ప్రస్తుతం వచ్చిన కమీషన్‌ సగానికి మించలేదని, క్వింటాల్‌కు రూ.22.50 వచ్చిందని డీలర్ల సంఘం నాయకులు పేర్కొంటున్నారు.
 
అరకొరగా.. అయోమయంగా..  

ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం క్వింటాల్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.35, రాష్ట్ర ప్రభుత్వం రూ.35 చెల్లించాలి. కానీ అరకొరగా రావడంతో డీలర్లు ఆమోమయానికి గురవుతున్నారు. ఇదెక్కడి న్యాయమని డీలర్లు గగ్గోలు పెడుతూ రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులను కలిసి ఏ లెక్కన ఈ చెక్కులు ఇచ్చారని ప్రశ్నిస్తే సమాధానం దొరకడం లేదు. డీలర్లు పంపిణీ చేసిన బియ్యానికి వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే.. జిల్లాకు రూ.14.74 కోట్లు బకాయిలు రావాలని, కండితుడుపుగా ఈ బకాయిలు ఇచ్చారని డీలర్ల సంఘం నాయకులు పేర్కొనగా, ఆహార భద్రత చట్టం ప్రకారం ఉన్న కార్డుల సంఖ్యను బట్టే కమీషన్‌ ఇచ్చామని, ఇంకా బకాయిలు పెండింగ్‌లో లేవని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయా.. లేదా అనే సందేశం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

బకాయిలు పెండింగ్‌లో లేవు 
డీలర్లకు చెల్లించాల్సిన కమీషన్‌ బకాయిలను గత నెల రోజుల క్రితం పంపిణీ చేశాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎలాంటి కమీషన్‌ బకాయిలు పెండింగ్‌లో లేవు. ప్రభుత్వం నుంచి మన జిల్లాకు ఎంత వచ్చిందో అంతే మొత్తం కమీషన్‌ నగదును చెక్కులు రూపంలో డీలర్లకు ఇచ్చేశాం. – సుదర్శన్,  జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top