breaking news
Dealers Commission
-
15 రోజుల్లోపే మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
సాక్షి,న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. ప్రతీ నెల పెరిగే వంటగ్యాస్ సిలిండర్ ధర ఈ నెలలో కేవలం 9 రోజుల్లోనే రెండవసారి పెరిగింది. ఎల్పీజీ డీలర్లకు ఇచ్చే కమిషన్‌ను ప్రభుత్వం పెంచడంతో వంటగ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన సరఫరాదారులు ఓ ప్రకటనలో తెలిపారు. తాజా పెంపుతో ఒక్కో సిలిండర్ ధర రూ. 507.42కు చేరింది. డీలర్ల కమిషన్ ప్రస్తుతం వంటగ్యాస్ డీలర్లకు 14.2కేజీల సిలిండర్‌కు రూ.48.89, 5కేజీల సిలిండర్‌కు రూ. 24.20 చొప్పున కమిషన్ ఇస్తున్నారు. అయితే దీన్ని పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14.2కేజీల సిలిండర్‌కు రూ. 50.58, 5 కేజీల సిలిండర్‌కు రూ. 25.29 చొప్పున కమిషన్ ఇవ్వాలి. 14.2 కిలోల సిలిండర్‌కు 20.50 డెలివరీ ఛార్జ్ ఉంటుంది. అయితే పంపిణీదారుల ప్రాంగణంనుంచి సిలిండర్‌ను నేరుగా తీసుకుంటే డెలివరీ ఛార్జినుంచి మినహాయింపు వుంటుందని ఇంధన సరఫరాదారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ నెలలో వంటగ్యాస్ ధర పెరగడం ఇది రెండో సారి. నవంబరు 1వ తేదీనే రాయితీ గ్యాస్ సిలిండర్‌పై రూ. 2.94 పెంచుతున్నట్లు ఇంధన సరఫరాదారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నుంచి ప్రతినెలా వంటగ్యాస్ ధర పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆరు నెలల్లో రూ. 16.21 మేర ధర పెరిగింది. -
కమీషన్ ‘సగమే’నా..!
ఆదిలాబాద్ మండలం రామాయి గ్రామ రేషన్ డీలర్ వినోద్ చౌదరి ప్రతీ నెల 475 కార్డులకు బియ్యం పంపిణీ చేస్తాడు. 2015 అక్టోబర్ నుంచి 2018 ఆగస్టు వరకు 3,395 క్వింటాళ్ల బియ్యాన్ని కార్డుదారులకు అందజేశాడు. జాతీయ ఆహార భద్రత చట్టం–2015 ప్రకారం క్వింటాల్‌కు రూ.50 చొప్పున, ఒక్కో కార్డు ట్రాన్సక్షన్కు రూ.17 చొప్పున కమీషన్‌ను కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. ఈ లెక్కన ఆయనకు మూడేళ్ల కమీషన్ రూ.1,69,765 రావాలి. కానీ నెల క్రితం రూ.76,765 చెక్‌ను ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. మిగతా రూ.93,000 చెల్లించాల్సి ఉన్నా.. ప్రభుత్వాల నుంచి స్పష్టత లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నాడు. అంటే ఆయనకు కమీషన్ సగమే ఇచ్చారని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్‌అర్బన్: నెల రోజుల క్రితం రేషన్ డీలర్లకు చెల్లించిన బకాయిలపై తిరకాసు మొదలైంది. ప్రభుత్వాలు చెల్లించింది పూర్తి కమీషనా..? లేక సగమేనా..? అనేది తెలియక డీలర్లలో గందరగోళం నెలకొంది. ట్రాన్సక్షన్ ప్రకారం డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్ మొత్తం చెల్లించామని, లేక సగమే ఇచ్చామని అటు కేంద్ర ప్రభుత్వం గానీ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పష్టతనివ్వకపోవడంతో వారిని అయోమయానికి గురిచేస్తోంది. ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం కమీషన్ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా జవాబు దొరకడం లేదు. కాగా, కేంద్రం నుంచి ఎంత కమీషన్ వచ్చిందో అంతే మొత్తాన్ని డీలర్లకు అందజేశామని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారులు పేర్కొనడంతో డీలర్లు అయోమయంలో పడ్డారు. బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సంతోషపడిన డీలర్లు తమకు వచ్చిన చెక్కులతో కంగుతిన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నగదు నిర్ణయించడం, ఏ లెక్కన కమీషన్ ఇచ్చారో స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ రూ.25కు మించి రాలేదా..? జాతీయ ఆహార భద్రత చట్టం–2015 అమల్లోకి రాకముందు కిలోకు రూ.20 పైసల చొప్పున క్వింటాల్‌కు రూ.20 డీలర్లకు కమీషన్ వస్తుండేది. చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కమీషన్ రూ.70కి పెరిగింది. ఈ లెక్కన ప్రతి క్వింటాల్‌కు రూ.70 చొప్పున ప్రభుత్వాలు కమీషన్ ఇవ్వాలి. ఇందులో కేంద్రం ప్రభుత్వం రూ.35 చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.35 చెల్లించాలి. అయితే 2015 అక్టోబర్ నుంచి 2018 ఆగస్టు వరకు ప్రభుత్వాల నుంచి డీలర్లకు కమీషన్ రావాల్సి ఉంది. ఇదీ కాకుండా ఆన్లైన్ ద్వారా ఒక్కో కార్డు ట్రాన్సక్షన్ చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.17 అదనంగా ఇస్తోంది. జిల్లాలో 355 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వీరందరికీ 35 నెలలకు సంబంధించిన కమీషన్ బకాయిలు సుమారు రూ.14.74 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, ఇందులో నుంచి గత నెలలో రూ.6.74 కోట్లు విడుదల చేశారు. ఇంకా దాదాపు రూ.8 కోట్లు రావాల్సి ఉంది. అంటే ప్రస్తుతం వచ్చిన కమీషన్ సగానికి మించలేదని, క్వింటాల్‌కు రూ.22.50 వచ్చిందని డీలర్ల సంఘం నాయకులు పేర్కొంటున్నారు. అరకొరగా.. అయోమయంగా.. ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం క్వింటాల్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.35, రాష్ట్ర ప్రభుత్వం రూ.35 చెల్లించాలి. కానీ అరకొరగా రావడంతో డీలర్లు ఆమోమయానికి గురవుతున్నారు. ఇదెక్కడి న్యాయమని డీలర్లు గగ్గోలు పెడుతూ రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులను కలిసి ఏ లెక్కన ఈ చెక్కులు ఇచ్చారని ప్రశ్నిస్తే సమాధానం దొరకడం లేదు. డీలర్లు పంపిణీ చేసిన బియ్యానికి వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే.. జిల్లాకు రూ.14.74 కోట్లు బకాయిలు రావాలని, కండితుడుపుగా ఈ బకాయిలు ఇచ్చారని డీలర్ల సంఘం నాయకులు పేర్కొనగా, ఆహార భద్రత చట్టం ప్రకారం ఉన్న కార్డుల సంఖ్యను బట్టే కమీషన్ ఇచ్చామని, ఇంకా బకాయిలు పెండింగ్‌లో లేవని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయా.. లేదా అనే సందేశం సర్వత్రా వ్యక్తమవుతోంది. బకాయిలు పెండింగ్‌లో లేవు డీలర్లకు చెల్లించాల్సిన కమీషన్ బకాయిలను గత నెల రోజుల క్రితం పంపిణీ చేశాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎలాంటి కమీషన్ బకాయిలు పెండింగ్‌లో లేవు. ప్రభుత్వం నుంచి మన జిల్లాకు ఎంత వచ్చిందో అంతే మొత్తం కమీషన్ నగదును చెక్కులు రూపంలో డీలర్లకు ఇచ్చేశాం. – సుదర్శన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
చంద్రన్న కానుకకు పన్ను పోటు
చౌకడిపో డీలర్ల కమీషన్లో కోత నేడు బందరులో సమావేశం జేసీకి సమస్యలు నివేదించేందుకు సిద్ధం విజయవాడ బ్యూరో : చంద్రన్న కానుక కిట్లు పంపిణీ చేసిన డీలర్ల కమీషన్లో పలు రకాల పన్నుల పేరిట కోత విధించడంతో చౌక డిపో డీలర్లు డీలాపడ్డారు. చందన్న కానుకను లబ్ధిదారులకు అందించినందుకు డీలర్లకు ఒక్కో ప్యాకెట్‌కు రూ.5 కమీషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని 13 లక్షల 17 వేలకు పైగా రేషన్ కార్డుల్లో 90 శాతానికి పైగా కానుకలు డీలర్ల ద్వారా పంపిణీ చేశారు. ఇందుకు తమకు కమీషన్ వస్తుందనుకున్న డీలర్ల ఆశలు ఆవిరవుతున్నాయి. వచ్చిన కమీషన్ కంటే ఖర్చులు తడిసిమోపెడయ్యాయంటూ లబోదిబోమంటున్నారు. సరుకులను తరలించేందుకు ఒక్కో షాపునకు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు కిరాయి, జట్టుకూలీ అయ్యాయని డీలర్లు వాపోతున్నారు. దీనికితోడు క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాల్లో త్వరగా పంపిణీ చేయాలని ఆదేశాలివ్వడంతో రూ. వెయ్యి ఖర్చుపెట్టి ప్రత్యేకంగా సహాయకుల్ని పెట్టుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వృత్తిపన్ను, ఆదాయపు పన్ను, సర్వీసు ట్యాక్స్ పేరుతో ఒక్కో డీలర్‌కు రూ.500 చొప్పున కోత పెడుతున్నట్టు తెలిసింది. మిగిలిన కమీషన్ మొత్తాన్ని సరుకుల డీడీల్లో తగ్గించి తీసుకునేలా ఈ నెలలో డీలర్లకు అధికారులు చెప్పారు. కమీషన్లో ట్యాక్స్ కోత గురించి అడిగితే అందుకు సరైన సమాధానం లభించక డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుకెళ్లేందుకు సోమవారం మచిలీపట్నంలో జిల్లా స్థాయి డీలర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా డీలర్ల సంఘం ప్రతినిధులు జాయింట్ కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.