ఇంకా విషాదంలోనే... లభించని రమ్య ఆచూకీ

Ramya Has not yet been Spotted in a Godavari Boat Accident Mancherial - Sakshi

పాపికొండలు గోదావరిలో గల్లంతు ఘటన 

రాత్రికి చేరిన బొడ్డు లక్ష్మణ్‌ మృతదేహం 

ఇంకా లభించని రమ్య ఆచూకీ 

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు 

సాక్షి, మంచిర్యాల : తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం సమీపాన కచ్చులూరు వద్ద ఆదివారం పర్యాటకులతో వెళ్తున్న పడవ నీటమునిగి పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని నంనూర్, కర్ణమామిడి గ్రామాలకు చెందిన ఇద్దరు యువ ఇంజినీర్లు గల్లంతైన విషయం తెలిసిందే.  కర్ణమామిడి పునరావాస కాలనీకి చెందిన బొడ్డు లక్ష్మణ్‌(26) నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలో విద్యుత్‌ శాఖలో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. లక్ష్మణ్‌ మృతదేహం ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో లభించింది. ఉదయం నుంచి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులరాకతో ఆ ఇంటి వాతావరణం అంతా విషన్నవదనాలతో మునిగిపోయింది. లక్ష్మన్‌ తల్లి శంకరమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. అర్దరాత్రి వచ్చిన మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు రోధించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది.     

తల్లడిల్లుతున్న రమ్య తల్లి... 
నంనూర్‌ గ్రామానికి చెందిన కారుకూరి రమ్య గోదావరిలో గల్లంతై రోజున్నర గడిచినా ఆచూకీ లభించలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు గోదావరిని జల్లెడ పడుతున్నా ఆచూకీ తెలియడం లేదు. రమ్య తండ్రి సుదర్శన్‌ సంఘటనా స్థలానికి బంధువులు, స్నేహితులతో వెళ్లారు. రమ్య మంచిర్యాలలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివింది. హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈఈఈ డిప్లమా చేసింది. అనంతరం హైదరాబాద్‌లోనే మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈఈఈ బీటెక్‌ పూర్తి చేసి అతి తక్కువ సమయంలోనే విద్యుత్‌శాఖలో సబ్‌ ఇంజనీర్‌గా కొలువు సాధించింది. ఉద్యోగం చేస్తూ నెలరోజుల వేతనం పొందిన రమ్య వరంగల్‌లోని విద్యుత్‌ శాఖా సమావేశానికి హాజరై పాపికొండలు విహార యాత్రకు వెళ్లి అనుకోని ఘటనలో గల్లంతైంది. ఈ సంఘటన ప్రతిఒక్కరినీ కదిలించగా తల్లి భూలక్ష్మి పడుతున్న ఆవేదన చూసి కన్నీటిపర్యంతం అవుతున్నారు. తిరిగి మంగళవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top