ఆహా..హలీమ్‌..

Ramadan Haleem Starts In Old City Hyderabad - Sakshi

రంజాన్‌ స్పెషల్స్‌కు పాతబస్తీ సిద్ధం  

బార్కాస్‌లో ఏడాది పొడవునా వంటకం

ఇక్కడి నుంచే అరబ్‌ దేశాలకు ఎగుమతి

చార్మినార్‌: రంజాన్‌ మాసం వస్తుందంటే ఆహార ప్రియుల అందరిమదిలోనూ ఒక్కటే ఆలోచన... ఈసారి పాతబస్తీలో తయారయ్యే హలీమ్‌లో ఎన్ని రుచులు వస్తున్నాయని. అంతేకాదు.. ఈ మాసంలో అందుబాటులో ఉంచే ప్రత్యేక వంటకాల గురించి ఆరా తీస్తుంటారు. ముస్లింలు ఉపవాస దీక్ష అనంతరం జరిగే ఇఫ్తార్‌ విందులో నోరూరించే పసందైన రుచుల వంటకాలను ఇష్టంగా తింటారు. భోజనప్రియుల కోసం అవే వంటలను పాతబస్తీలో అందించేందుకు హోటళ్లు సిద్ధంగా ఉంటాయి. 

హలీమ్‌కు పెట్టింది పేరు పాతబస్తీ..
పాతబస్తీ హలీమ్‌ రుచులకు పెట్టింది పేరు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు ఈ నెలలో ఇక్కడకు వచ్చి మరీ హలీం తినడం అలవాటుగా చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో ఇక్కడి హోటళ్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతాయి. ఇక పిస్తాహౌజ్‌ హలీమ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఉంది. మదీనా సర్కిల్‌లోని షాదాబ్‌ హోటల్, నయాగ్రా హోటల్, శాలిబండలోని షాగౌస్, బార్కాస్‌ తదితర హోటళ్లలో ఎన్నో ఏళ్లుగా వెజ్, నాన్‌వెజ్‌ హలీం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి హలీమ్‌ పర్షియా దేశపు వంటకం. కుతుబ్‌షాహీల కాలంలో మనకు పరిచయమైంది. ప్రస్తుతం ఇరాన్‌ ప్రజలు సైతం పాతబస్తీ హలీం కోసం ఆరాటపడుతుంటారంటే మన వంటవారి చేతి మహిమ అలాంటిది. శాలిబండలోని ఫిస్తాహౌజ్‌ అరబ్‌ దేశాలకు ఇక్కడి హలీమ్‌ను ఎగుమతి చేస్తుంది. శతాబ్ధాల క్రితం ఇరాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఈ వంటకం ఇప్పుడు కొత్త రుచితో అదే ఇరాన్‌కు వెళుతోంది.

21 వస్తువులతో తయారీ
ఇలాచీ, దాల్చిని చెక్క, లవంగా, షాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చి మిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లులి, నెయ్యి, గులాబీ పూలు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, వేయించిన ఉల్లి తరుగు, కాజు.. గోధుమలు వంటి 21 రకాల దినుసులకు పొటేలు, కోడి మాంసాన్ని కలిపి హలీమ్‌ను తయారు చేస్తారు. శాకాహార ప్రియుల కోసం వెజిటేబుల్‌ హలీమ్‌ సైతం నగరంలో అందిస్తున్నారు.

బార్కాస్‌లో ఏడాదంతా..
పాతబస్తీ బార్కాస్‌లో రంజాన్‌ మాసంతో సంబంధం లేకుండా అన్ని రోజుల్లోనూ హలీమ్‌ అందుబాటులో ఉంటుంది. కుతుబ్‌షాహీల కాలంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేసేందుకు యెమన్‌ దేశం నుంచి వచ్చినవారు ఇక్కడ స్థిరపడ్డారు. శతాబ్దాలు గడుస్తున్నా ఇక్కడ ఇప్పటికీ అరబ్‌ సంస్కృతి అలాగే కొనసాగుతోంది. దీంతో వారు హలీమ్‌ను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top