రఘుమారెడ్డికి జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డు | Sakshi
Sakshi News home page

రఘుమారెడ్డికి జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డు

Published Fri, Apr 13 2018 10:49 AM

Raghuma Reddy Get National Best Farmer Award - Sakshi

మహేశ్వరం: కంది పంట సాగు చేసి నాణ్యతతో కూడిన విత్తనాలను తయారు చేసినందుకు మహేశ్వరం మండలం ఘట్టుపల్లి గ్రామానికి చెందిన  రైతు కొరుపోలు రఘుమారెడ్డికి జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డు దక్కింది. గురువారం కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడా) వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా నగరంలోని సంతోష్‌నగర్‌లో ఉన్న కృషి వి/êన కేంద్రంలో రఘుమారెడ్డికి అవార్డు అందజేశారు. తన పొలంలో రఘుమారెడ్డి కంది పంట పిఆర్‌జీ 176 రకం, ఉలవలు సీఆర్‌హెచ్‌జీ 04 రకం పండించి అధిక దిగుబడి సాధిచడంతో పాటు నాణ్యతతో కూడిన విత్తనాలను ప్రదర్శించారు. అచ్చు పద్ధతిలో కంది, ఉలవల పంటలు  సాగు చేసి ఎకరానికి 5.5 క్వింటాళ్ల దిగుబడి సాధించారు.

ఈ పంటలను క్రిడా అధికారులు పరిశీలించారని, అందరి కంటే ఎక్కువ దిగుబడి సాధించడంతో పాటు అవి నాణ్యతగా ఉండడంతో రఘుమారెడ్డికి అవార్డు అందజేశామని   కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంచాలకురాలు ఉషారాణి చెప్పారు. కొత్త పరిశోధనలతో పంటలను పండించి అధిక దిగుబడి సాధించిన రైతులను ప్రోత్సహించి అవార్డు అందజేసి సత్కరిస్తామని ఆమె తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పది మంది రైతులను ఎంపిక చేసి అవార్డులు అందజేశామన్నారు. ఈ సందర్బంగా అవార్డు పొందిన రైతు రఘుమారెడ్డి మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని,  మరిన్ని కొత్త పద్ధతులతో పంటలను సాగు చేస్తానని, తాను పాటించిన పద్ధతులను ఇతర రైతులకు తెలియజేస్తానని అన్నారు. అవార్డు ప్రదాన  కార్యక్రమంలో మహేశ్వరం ఏడీఏ రుద్రమూర్తి, మండల వ్యవసాయాధికారి కోటేశ్వరరెడ్డి, ఏఈఓ రాజు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement