బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం

R krishnaiah at bc association meeting - Sakshi

బీసీ సంఘాల సమాఖ్య సమావేశంలో నేతలు  

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల్లోని కులాలు ఐక్యంగా ఉంటేనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమని బీసీ కుల సంఘాల సమాఖ్య అభిప్రాయపడింది. ఈ నెల 12న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బీసీ సంఘాలు, మేధావులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య, ప్రతినిధులు అనిల్‌కుమార్‌యాదవ్, ఎర్ర సత్య నారాయణ, నరేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

బీసీ సంఘాలన్నీ ఏకతాటిపై నడవాలని ప్రతినిధులు తీర్మానించారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా కామన్‌ ఎజెండాతో ముందుకెళ్లాలని నేతలు తీర్మానించారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీలకు రావాల్సిన వాటా కన్నా తక్కువగా లభిస్తోందని, దీంతో బీసీలు మరింత వెనుకబాటుకు గురవుతున్నారన్నారు.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని, ఈ దిశగా కార్యాచరణ తయారు చేయనున్నామని ప్రకటించారు. చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని, ఇందుకు రాజకీయ కోణంలోనే చర్యలు తీసుకోవాలన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top