రైతులు అమ్మిన పంటకు తక్షణ చెల్లింపులు

Project Report for New Market Yard in the Vanaparti - Sakshi

వేర్‌హౌసింగ్‌కు గోదాముల నిర్వహణ అప్పగింత 

నగరంలో మరో 40 ‘మన కూరగాయల స్టాళ్లు’ 

వనపర్తిలో కొత్త మార్కెట్‌ యార్డుకు ప్రాజెక్టు రిపోర్టు 

వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌ : అసంపూర్తిగా ఉన్న మార్కెటింగ్‌ గోదాముల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగిం చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆదేశించారు.రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర చెల్లించి వారినుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు తక్షణమే డబ్బులు చెల్లించాలన్నారు. అవసరమైన చోట గోదాములకు మరమ్మతులు చేయాలని, ఖాళీగా ఉన్న వాటిని గిడ్డంగుల శాఖకు అప్పగించి వినియోగంలోకి తేవాలన్నారు. సచివాలయంలో శనివారం మార్కెటింగ్‌ శాఖ కార్యకలాపాలపై మంత్రి నిర్వహించిన సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్‌ విభాగం డైరెక్టర్‌ లక్ష్మీబాయి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పౌర సరఫరాలు, వేర్‌హౌసింగ్‌ విభాగం నుంచి మార్కెటింగ్‌ శాఖకు రావాల్సిన అద్దె బకాయిలకు గాను సంబంధిత విభాగాల అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి, వసూలు చేయాలని మంత్రి ఆదేశించారు.పంటల సాగు విస్తీర్ణంతోపాటు, దిగుమతి వివరాలపై వ్యవసాయ అధికారులు కచ్చితమైన సమాచారం సేకరించాలన్నారు. మలక్‌పేటలోని ఉల్లిగడ్డల మార్కెట్‌ను పటాన్‌చెరుకు, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ కోహెడకు, ఖమ్మం మిర్చి యార్డును మద్దులపల్లికి తరలించేందుకు కొత్త భవనాలు నిర్మించాలన్నారు. వనపర్తిలో కొత్త మార్కెట్‌ యార్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.అవసరమైన ప్రాజెక్టు రిపోర్టు, నిధుల సేకరణ, షాపుల కేటాయింపు తదితరాల కోసం ప్రతీ మార్కెట్‌కు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.

మార్కెట్‌ ఫీజు ఎగవేతకు అడ్డుకట్ట 
మార్కెట్‌ యార్డుల్లో పంటను అమ్మిన రైతులకు కంప్యూటరైజ్డ్‌ తక్‌పట్టీలు ఇవ్వాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. వ్యాపారులు మార్కెట్‌ ఫీజు ఎగవేయకుం డా వసూలు చేసి ఆదాయాన్ని పెంచాలన్నా రు. రైతు బజార్లలో నకిలీ రైతులను ఏరివేసి సదుపాయాలు మెరుగు పరచాలన్నారు. కూరగాయల ధరలు నియంత్రణలో ఉండేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో 60 ‘మన కూరగాయల స్టాళ్ల’ద్వారా నగర వాసులకు తాజా కూరగాయలు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వివరించారు. నగరం లో మరో 40 స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంటల సాగు నుంచి ఉత్పత్తి, అమ్మకం వరకు రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పౌర సరఫరాలు, మార్క్‌ఫెడ్‌ శాఖ లు సమీక్ష చేసుకొని సమన్వయం తో పనిచేయాలని సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top