ఇన్నాళ్లకు మోక్షం.. సత్ఫలితాలిస్తున్న పవర్‌ వీక్‌

Power Week Is Giving Good Results In Wanaparthy District - Sakshi

ఏళ్లుగా వేధిస్తున్న విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం

జిల్లా వ్యాప్తంగా 22,284 సమస్యల గుర్తింపు

24 రోజుల్లో పరిష్కరించినవి 7,361

ప్రయోజనకరంగా 30రోజులప్రణాళిక కార్యక్రమం

సాక్షి, వనపర్తి: మా ఊర్లో విద్యుత్‌ సంభం ఒరిగింది.. వైర్లు వదులుగా అయ్యాయి.. స్థంభాలు దెబ్బతిని కూలిపోయేలా ఉన్నాయి... ఇలా గతంలో ఆయా గ్రామాల్లో గ్రామస్తులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విద్యుత్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేసేవారు. అంతంతమాత్రంగానే స్పందన ఉండేది. ఎంతకూ గ్రామాలకు రాని విదుత్‌ శాఖ అధికారులు ప్రస్తుతం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమంలో గ్రామంలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఒరిగిన స్థంభాలను సరిచేస్తున్నారు. వదులుగా ఉన్న వైర్లను తీసి కొత్తవైర్లు బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నారు. స్తంభాలు పాతుతున్నారు. కొత్తగా అవసరమైన చోట అడిగిందే తడువుగా తీసుకుని వచ్చేస్తున్నారు. చూస్తుండగానే ఒక్కో గ్రామంలో రెండుమూడు రోజుల్లో విద్యుత్‌ సమస్యలు కొలిక్కివస్తున్నాయి. ఏళ్లుగా చీకట్లో ఉండే గడిపిన కాలనీలలో ప్రస్తుతం ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.  

జిల్లా వ్యాప్తంగా 22,284 సమస్యలు గుర్తింపు  
జిల్లాలోని 225 గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌ శాఖకు సంబంధించి మొత్తం 22,284 సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గడిచిన 24 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సమస్యలలో అధికారులు 7,361 సమస్యలను పరిష్కరించారు. రోజువారీగా రిపోర్టులు తయారు చేసి విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. 

సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు  
పవర్‌ వీక్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గుర్తించిన విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు రూ.8.50 కోట్ల నిధుల ను వనపర్తి జిల్లాకు కేటాయించారు. గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ఈ నిధులు వినియోగిస్తున్నారు. సరిపోకుంటే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు విద్యుత్‌ శాఖ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

ప్రతి గ్రామంలో థర్డ్‌వైర్‌..  
జిల్లాలో థర్డ్‌వైర్‌ కొన్ని గ్రామాల్లో ఉంటే, మరికొన్ని గ్రామాల్లో లేవు. విద్యుత్‌ దీపాలను అమర్చేందుకు ఉపయోగించే ఈ థర్డ్‌వైర్‌ను ప్రతి జనావాస ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌శాఖ అ«ధికారులు కృషి చేస్తున్నారు.  

ఏళ్లనాటి సమస్యలు పరిష్కారం  
పవర్‌ వీక్‌ కార్యక్రమం వలన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ప్రతి ఏటా ఇలాంటి పవర్‌వీక్‌ కార్యక్రమం నిర్వహించాలి. చాలాచోట్ల శిథిలావస్థకు చేరిన విద్యుత్‌ స్థంభాల స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. వదులుగా.. ఉన్న వైర్లను బిగించారు.  
– శేఖర్‌ నాయుడు, రాయినిపల్లి, పానగల్‌ మండలం 

ప్రతి సమస్యను పరిష్కరిస్తాం  
పవర్‌వీక్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో గుర్తించి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. సమస్యల పరిష్కారం కోసం రూ.8.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మరికొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది.  ఇప్పటికే.. సుమారు 7,400 సమస్యలను పరిష్కరించాం. గ్రామాల్లో మాసిబ్బంది నిత్యం పని చేస్తూనే ఉన్నారు. 
– లీలావతి, ట్రాన్స్‌కో డీఈఈ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top