దక్కకపాయె.. 

Politics Expands Telangana Cabinet Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చోటు లభించలేదు. తొలివిడత విస్తరణలోనే జిల్లాకు మంత్రి పదవి లభిస్తుందని అందరూ భావించినా.. చివరి నిమిషంలోనైనా చోటు కల్పిస్తారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆశించినా.. చివరికి నిరాశే మిగిలింది. కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో సంఖ్య పరిమితంగా ఉండడం.. వివిధ సమీకరణాల ఆధారంగా కూర్పు ఉండడంతో తొలివిడతలో అవకాశం దక్కలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉండడం.. జిల్లాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్‌ మాత్రమే గెలవడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని కొంతకాలంగా పార్టీ వర్గాల్లో ప్రచారం హోరెత్తింది.

అజయ్‌ వర్గీయులు సైతం మంత్రి పదవి వస్తుందనే భరోసాతో ఉన్నా.. చివరి నిమిషంలో సీఎం కేసీఆర్‌ జిల్లా విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో ఒక్క ఖమ్మం జిల్లాకు మాత్రమే మంత్రివర్గంలో చోటు లభించలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నందున జిల్లా నుంచి అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప టీఆర్‌ఎస్‌కు ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న అజయ్‌కుమార్‌కు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలే ఎక్కువ అని పార్టీలోని ఆయన అభిమాన గణం విశ్లేషిస్తోంది. మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఖమ్మం జిల్లా నుంచి ఎవరికి స్థానం లభిస్తుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా.. చివరికి జిల్లాలో ఎవరికీ అవకాశం లభించని పరిస్థితి ఏర్పడింది.

‘సండ్ర’ స్థానంపై ప్రచారం.. 
సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటారని, ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సండ్ర టీఆర్‌ఎస్‌లో చేరిక అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మంత్రివర్గ విస్తరణకు ఒక్కరోజు ముందు వరకు అజయ్‌కి మంత్రివర్గంలో అవకాశం ఇస్తారని జిల్లాలో ప్రచారం జరిగింది. అయితే జిల్లా రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుని టీఆర్‌ఎస్‌ అధినేత మంత్రివర్గాన్ని కూర్పు చేశారని.. అందుకే జిల్లాకు తొలివిడతలో అవకాశం రాలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు అనుకూల వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఎన్నిక కావడంతో టీఆర్‌ఎస్‌ సైతం జిల్లాకు అదేస్థాయి ప్రాధాన్యం కల్పిస్తుందని రాజకీయంగా జిల్లాలో బలోపేతం కావడానికి వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుందని భరోసాగా ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో తొలి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం లేకపోవడం కొంత నిస్తేజాన్ని మిగిల్చింది. మరోసారి విస్తరించే మంత్రివర్గంలో జిల్లాకు స్థానం దక్కుతుందనే ఆశతో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

2014లోనూ.. 
2014లో ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వంలోనూ ఖమ్మం జిల్లాకు మొదటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం చిక్కలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకుగాను.. టీఆర్‌ఎస్‌ తరఫున ఆ సమయంలో కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు విజయం సాధించారు. 2014, జూన్‌ 2న జరిగిన తొలి మంత్రివర్గ విస్తరణలో మాత్రం వెంకట్రావుకు స్థానం లభించలేదు. 2014, డిసెంబర్‌ 16వ తేదీన రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించిన సమయంలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు సెప్టెంబర్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరొందిన తుమ్మలకు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించి.. తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. గతంలోనూ టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో సైతం ఖమ్మం జిల్లాకు తొలి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించని సంఘటనలు ఉన్నాయని, అయితే జిల్లాకు రాజకీయంగా గల ప్రాధాన్యత దృష్ట్యా.. పార్టీ అవసరాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేని లోటును తీర్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశం ఉందని.. మంత్రివర్గ విస్తరణ మరోసారి జరిగేలోపే జిల్లా నేతలను కేబినెట్‌ స్థాయి పదవులు వరించే అవకాశం ఉన్నట్లు సైతం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం ఖమ్మం జిల్లాకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై సైతం రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో నెలకొన్న వర్గపోరు కారణంగా పార్టీ ఒక స్థానానికే పరిమితం కావాల్సి వచ్చిందని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ అధిష్టానం.. కొంత వేచిచూసే ధోరణితో ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top