‘గుట్ట’ను పాలించింది ముగ్గురే..! | Sakshi
Sakshi News home page

‘గుట్ట’ను పాలించింది ముగ్గురే..!

Published Fri, Jan 3 2020 8:23 AM

Political Parties Showing Interest In Local Elections - Sakshi

సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : 1951– 52లో యాదగిరిగుట్ట గ్రామపంచాయతీగా ఏర్పడగా.. మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న యాదగిరిగుట్టను 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీగా చేశారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు దాతారుపల్లి పరిధిలోని పాతగుట్ట, పెద్దిరెడ్డిగూడెం గ్రామాలు కూడా మున్సిపాలిటీలో కలిపారు. యాదగిరిగుట్ట గ్రామపంచాయతీగా ఉన్న కాలంలో ముగ్గురు వ్యక్తులే సర్పంచ్‌లుగా సుమారు 63 సంవత్సరాలు పాలించారు. 

వివరాలు పరిశీలిస్తే.. 
యాదగిరిగుట్ట గ్రామపంచాయతీ ఏర్పాటు అయిన నాటి నుంచి ముగ్గురు సర్పంచ్‌లు మాత్రమే పరిపాలించారు. 1952లో యాదగిరిగుట్ట సర్పంచ్‌గా యాదగిరిపల్లికి చెందిన వేముల లక్ష్మీనర్సయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి 1995 వరకు వరుసగా 43 సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్‌గా కొనసాగారు. ఆ తర్వాత 1995లో గుట్ట సర్పంచ్‌ బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో లక్ష్మీనర్సయ్య తన సుదీర్ఘ పదవి నుంచి తప్పుకున్నారు.

1995లో జరిగిన ఎన్నికల్లో తొలి మహిళా సర్పంచ్‌గా కైరంకొండ శ్రీదేవి గెలుపొంది 1995–2000, 2001–2006, 2006–11వరకు 15 సంవత్సరాలు సర్పంచ్‌గా కొనసాగింది. ఆ తరువాత ఎస్సీ రిజర్వ్‌ కావడంతో 2013–14లో జరిగిన ఎన్నికల్లో యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బూడిద స్వామి గెలుపొందారు. ఈయన 1 ఆగస్టు 2018 వరకు సర్పంచ్‌గా కొనసాగారు.

ఇప్పుడు చైర్మన్‌ పదవి ఎవరికో..
2018 ఆగస్టు 2న ఏర్పాటు ఆయిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎన్నికలు ఎప్పుడెప్పుడా అన్నట్లు ఆశావహులు ఎదురుచూశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో తొలి చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి పలువురు సిద్ధమయ్యారు. ప్రధానంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు పట్టణాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తుండటంతో తొలి చైర్మన్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది.

ఇక టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బలం పెంచుకున్న దానిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ నాయకులు మున్సిపల్‌ చైర్మన్‌ గిరిని చేజిక్కించుకునేందుకు ముందుకు వెళ్తున్నారు. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చూపించి కాషాయం జెండా ఎగురవేయాలని భావిస్తోంది. సీపీఐ, సీపీఎంలు తమ పట్టును చాటుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఈ పార్టీలతో పాటు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి చైర్మన్‌ రేసులో ఉండాలని పలువురు యువకులు భావిస్తున్నారు.   

Advertisement
Advertisement