పోడు భూములపై అటవీ సిబ్బంది దౌర్జన్యం    | Sakshi
Sakshi News home page

పోడు భూములపై అటవీ సిబ్బంది దౌర్జన్యం   

Published Fri, Aug 10 2018 11:19 AM

Podu Farming Fight - Sakshi

టేకులపల్లి : మండలంలోని  చింతోనిచెలక పంచాయతీ చింతోనిచెలక తండాలో అటవీ శాఖాధికారులు  ఓ గిరిజనుడి  పంట చేనుపై గురువారం దాడికి పాల్పడ్డారు. ఆదివాసీ దినోత్సవం రోజే గిరిజనుడి పంటను ధ్వంసం చేసి  ఆ కుటుంబాన్ని శోకంలో ముంచెత్తడం గమనార్హం. బాధిత రైతు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.

చింతోనిచెలక తండాకు చెందిన సుమారు 26 మంది  రైతులు కొన్నేళ్ళ క్రితం పోడు కొట్టుకుని సాగు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుత  సీజన్‌లో రైతులందరూ  పత్తి పంట వేశారు. మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇదే గ్రామానికి చెందిన మాలోత్‌ బాలాజీ గురువారం  భార్య, తల్లితో కలిసి చేలో కలుపు తీస్తున్నారు. అటవీ అధికారులు, సిబ్బంది పది మంది  బృందం మూకుమ్మడిగా బాలాజీ చేనులో దాడికి పాల్పడ్డారు.  

అధికారులను వేడుకున్నా.. 

హరితహారం మొక్కలు నాటాలని చెబుతూ చేను లో ఉన్న పత్తి మొక్కలన్నింటినీ  పీకేశారు. బాధిత రైతు బాలాజీ, ఆయన భార్య, తల్లి  అధికారుల కాళ్లపై పడి బతిమిలాడినా వినలేదు. వారిని పక్కకు నెట్టేసి మొక్కలను పీకేశారు.  పంటను నాశనం చేయొద్దని , తమ కుటుంబానికి అదే జీవనాధారమని ఎంత వేడుకున్నా వినకుండా పత్తి పంటను  ధ్వంసం చేశారు.

ఇదే గ్రామానికి చెందిన రైతులందరి పోడు భూములు అక్కడే ఉన్నాయి. కేవలం బాలాజీ  భూమిలోనే హరితహారం మొక్కలు నాటేందుకు పూనుకోవడం విశేషం. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైతు బోడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  

వీడియో తీయొద్దంటూ హుకుం.. 

ఫారెస్టు అధికారులు పత్తి పంటను నాశనం చేస్తున్న దృశ్యాన్ని బాధిత రైతు కుటుంబ సభ్యులు ఒకరు వీడియో తీస్తుండటంతో  అక్కడే ఉన్న ఫారెస్టు అధికారి ఒకరు ఆవేశానికి గురయ్యారు. వెంటనే వీడియోను నిలిపివేయాలని  సదరు యువకుడి వద్దకు వచ్చి హెచ్చరించాడు. మొబైల్‌ ఫోన్‌ గుంజుకోవడానికి ప్రయత్నించినట్లు బాధిత రైతు వాపోయాడు.  

Advertisement
Advertisement