వచ్చే 24 రోజులూ అగ్నిపరీక్షే..! | Plumped for the next 24 days ..! | Sakshi
Sakshi News home page

వచ్చే 24 రోజులూ అగ్నిపరీక్షే..!

Apr 7 2014 4:38 AM | Updated on Nov 6 2018 5:52 PM

వచ్చే 24 రోజులూ అగ్నిపరీక్షే..! - Sakshi

వచ్చే 24 రోజులూ అగ్నిపరీక్షే..!

నగర పోలీసులకు రాబోయే 24 రోజులూ అగ్నిపరీక్షే. ఇప్పటికే ఎన్నికల బందోబస్తులో తలమునకలై ఉన్న పోలీసులకు...

  • 8,15 తేదీల్లో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శోభయాత్రలు
  •      30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్
  •      గల్లీగల్లీలో ఎన్నికల లొల్లి
  •      పోలీసులకు సవాల్‌గా మారనున్న బందోబస్తు
  •  సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులకు రాబోయే 24 రోజులూ అగ్నిపరీక్షే. ఇప్పటికే ఎన్నికల బందోబస్తులో తలమునకలై ఉన్న పోలీసులకు ఈనెలలోనే వచ్చిన శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభయాత్రల బందోబస్తు తలకు మించిన భారం కానుంది. ఈ రెండు ఉత్సవాలు, ఊరేగింపులో ఏ చిన్నపొరపాటు జరిగినా శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. గతంలో కర్ఫ్యూ వరకు దారి తీసిన ఘటన జరిగాయి.  వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ ముందస్తు బందోబస్తు ఏర్పాట్లపై కిందిస్థాయి అధికారులతో చర్చించారు.

    8న శ్రీరామ నవమి నేపథ్యంలో ధూల్‌పేటలోని గంగాబౌలి నుంచి ప్రారంభ మయ్యే శోభాయాత్ర ఊరేగింపు పురానాపూల్, జాలిహనుమాన్, జుమ్మేరాత్‌బజార్, చుడీబజార్, ఛత్రీ, బేగంబజార్, సిద్ధంబర్‌బజార్, గౌలిగూడ మీదుగా రాత్రికి కోఠి హనుమాన్ వ్యాయామశాల వద్దకు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభతో ముగుస్తుంది. అలాగే ఈనెల 15న హనుమాన్ జయంతి సందర్భంగా మరో శోభయాత్ర ఊరేగింపు జరుగనుంది.

    ఇది గౌలిగూడ రాంమందిర్ నుంచి ప్రారంభమై పుత్లీబౌలి మీదుగా, కోఠి, సుల్తాన్‌బజార్, కాచిగూడ చౌరస్తా, నారాయణగూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి తాడ్‌బన్ హనుమాన్ ఆలయానికి చేరుకొని.. రాత్రి అక్కడ బహిరంగసభతో ముగుస్తుంది. ఈ రెండు శోభయాత్రలు సాగే మార్గాల్లో కొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉండటంతో పోలీసులు  ప్రతిష్ట బందోబస్తును నిర్వహించాల్సి ఉంది. దీంతో ఇక్కడ అదనపు బలగాలను వినియోగించాలని కమిషనర్ నిర్ణయించారు. అలాగే ఊరేగింపు పూర్తయే వరకు నిఘాను ఉంచాలని ఆదేశించారు.

    యాత్రల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా వాహనాలను దారి మళ్లించే ఏర్పాటు చేస్తున్నారు. మరో పక్క ఎన్నికల నామినేషన్ ఘట్టం పూర్తయి, ప్రచారం జోరందుకుంటుండడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా చిన్న పొర పాటు జరిగినా ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలున్నాయి.  ఒకపక్క ప్రచారం కోసం అనుమతికై రాజకీయ పార్టీలు చేసుకునే దర ఖాస్తులను పరిశీలించడం, మరోపక్క ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రచారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులను మంజూరు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.

    ఈ సమస్యను అధిగమించేందుకు స్పెషల్ బ్రాంచ్ అధికారుల సహాయం తీసుకోనున్నారు. ఎన్నికల ప్రచార అనుమతి ఇచ్చే ముందు అక్కడి స్థానిక స్పెషల్ బ్రాంచ్ అధికారి పంపిన నివేదికను పరిగణలోకి తీసుకుని అనుమతులు ఇవ్వాలని  నిర్ణయించారు. ముఖ్యంగా పాతబస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement