తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గోయల్‌

Piyush Goyal Lays Foundation Stone Of Railway Development Works - Sakshi

దక్షిణ భారత్‌ను నిర్లక్ష్యం చేశారనడం అవాస్తవం

రైల్వే అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ శంకుస్థాపన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో  మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాడు పోరాటం చేశామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ  అందరి  కోసం పని చేస్తానని మాట ఇచ్చారని, దానికి కట్టుబడి పని చేస్తున్నామని తెలిపారు. దక్షిణ భారత్‌ను నిర్లక్ష్యం  చేశారనడం అవాస్తవమన్నారు.

‘కాంగ్రెస్‌ హయాంలోనే సౌత్‌ సెంట్రల్‌ రైల్వేను  నిర్లక్ష్యం చేశారు. ప్రధాని మోదీకి  దేశమంతా ఒక్కటే, రూ.258 కోట్లు గతంలో ఇచ్చారు.  కానీ ఇప్పటి  బడ్జెట్‌లో పదింతలు ఎక్కువ నిధులు ఇచ్చాం.  కేంద్రం ఎంత ఇచ్చిందో నా దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయని’ వివరించారు. రూ.258 కోట్లతో తెలంగాణలో రైలు మార్గాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 2008లో ప్రారంభించిన పెండింగ్‌ పనులు అన్ని పూర్తి చేశామన్నారు. ఎంఎంటీఎస్‌ కోసం 500 కోట్లు కేంద్రం ఇచ్చిందని.. రాష్ట్రం ఇంకా డబ్బులు ఇవ్వలేదని..అది ఇస్తే పనులు పూర్తవుతాయన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఆగదలేదని ఆయన తెలిపారు.

ఎంఎంటీఎస్‌, సబ్బరన్‌ రైళ్ల సంఖ్య పెంచాలి..
కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ప్రధాన సమస్య అని..సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి వేల మంది ప్రయాణిస్తారని..చర్లపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద శాటిలైట్‌ టర్మినల్‌ ఏర్పాటుతో రద్దీ భారం తగ్గుందన్నారు. ఎంఎంటీఎస్‌, సబ్బరన్‌ రైళ్ల సంఖ్య పెంచాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని ఆయన కోరారు. యాద్రాది వరకు ఎంఎంటీస్‌పై కేంద్రం దృష్టిపెడితే రైల్వే ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందన్నారు. 427 రైల్వేస్టేషన్లలో ఉచిత హైస్పీడ్‌ వైపై సౌకర్యం కల్పించడం మంచి పరిణామం అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపాలి..
సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అభివృద్ధి విషయంలో కేంద్రం ప్రతిసారి నిర్లక్ష్యం చూపుతోందని..ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌ ను ఘట్కేసర్‌ వరకు పొడిగించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top