‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు’

Owaisi Claims His Speech Was Not Communal - Sakshi

హైదరాబాద్‌ : కరీంనగర్‌లో తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎవరినీ రెచ్చగొట్టేలా చేసినవి కాదని ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి చట్టవిరుద్ధ ప్రకటన చేయలేదని, ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడలేదని చెప్పారు. అక్బరుద్దీన్‌ బుధవారం కరీంనగర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. నేను భయపడేది నా గురించి కాదు.. రాబోయే తరాల గురించి నా భయం. కరీంనగర్‌లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీ అడ్రస్‌ కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా కరీంనగర్‌ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మజ్లిస్‌ గెలవలేదని బాధలేదు. బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉంది.

మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారు. మజ్లిస్‌ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారు ఎవరో కాదు. గాడ్సేని పొగిడినవాళ్లే. గమ్యాన్ని ముద్దాడే భావోద్వేగాలంటే నాకు ఇష్టం’అంటూ అక్బరుద్దీన్‌ ప్రసంగించారు. దేశంలోని ముస్లింలను ఆర్‌ఎస్‌ఎస్‌ హతమారుస్తోందని ఆరోపించారు. 2013లో తాను చేసిన ‘15 నిమిషాల’  ప్రసంగంపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఇంకా ఉలిక్కిపడుతోందని వ్యాఖ్యానించారు. 2013లో అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

పోలీసులు 15 నిమిషాల పాటు పక్కకు తప్పుకుంటే ముస్లింలు 100 కోట్ల మంది హిందువులను మట్టుబెడతారని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాగా కరీంనగర్‌లో అక్బరుద్దీన్‌ ప్రసంగంపై బీజేపీ, సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు అక్బరుద్దీన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top