సాక్షి ప్రతినిధి, వరంగల్: దళిత సంక్షేమ శాఖలో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. పరిపాలన వైఫల్యంతో ఆ శాఖ ఉద్యోగులు ఓ వైపు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆ శాఖకు సంబంధించి కోట్లాది రూపాయల ఆస్తులను ఇతర శాఖలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా... ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.10 కోట్ల సబ్‌ప్లాన్ నిధులు
2013లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.10 కోట్లు కేటాయించింది. ఆ నిధులను విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నగరంలో హాస్టల్ భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇవి నగర పరిధిలో కళాశాలలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ అధికారులతో సంప్రదింపులు జరిపి ఆర్ట్స్ కాలేజీ వెనుక స్థలం, కేయూ క్యాంపస్ , పలివేల్పుల, యాదవనగర్‌లో మొత్తం నాలుగు హాస్టళ్లు నిర్మించాలని నిర్ణయించారు. రెండేళ్ల వ్యవధిలో ఈ హస్టళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తి చేసుకుని దాదాపు రెండేళ్లు గడుస్తున్నా.. వీటిలో ఏ ఒక్కటి కూడా దళిత సంక్షమ శాఖ ఆధీనంలో లేవు. ఎక్కడివక్కడ ఇతర ఇతర శాఖలు ఆక్రమించుకున్నాయి.
భవనాలపై పేచీ..
పలివేల్పుల హాస్టల్ భవనం రెసిడెన్షియల్ స్కూల్ విభాగానికి అప్పగించారు. కేయూలో ఉన్న హాస్టల్ ప్రారంభానికి అక్కడి అధికారులు ఒప్పుకోలేదు. తమ క్యాంపస్‌లో మరో శాఖకు చెందిన హాస్టల్ ఉండడానికి ససేమిరా అంటున్నారు. నిర్మాణం పూర్తయిన భవనాన్ని తమకు అప్పగిస్తే యూనివర్సిటీ అవరాలకు ఉపయోగించుకుంటామని చెబుతున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఉన్న భవనం పరిస్థితి ఇంచుమించు ఇదే. యాదవనగర్‌లో నిర్మించిన హాస్టల్ భవనం అప్పగింత విషయంలో కాంట్రాక్టర్, దళిత సంక్షేమ శాఖకు మధ్య వివాదం నెలకొంది. ఏళ్లు గడిచినా ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో కాంట్రాక్టర్ కిరికిరితో అధికారులకు అప్పగించలేదు.
నిర్లక్ష్యం..
దళిత సంక్షేమ శాఖ ఒక్కో హస్టల్ నిర్మాణానికి దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేసింది. నాలుగు హాస్టళ్లకు కలిసి దాదాపు రూ.10 కోట్లు ఖర్చయింది. లెక్కాపత్రం లేకుండా నోటి మాటలతో భవన నిర్మాణ పనులు ప్రారంభించడంతో ప్రస్తుతం కేయూ క్యాంపస్, ఆర్ట్స్ కాలేజీ భవనాల స్వాధీనం చిక్కుముడుల్లో పడింది. పలివేల్పుల హాస్టల్ భవనం ఇప్పటికే చేజారిపోయింది. కాంట్రాక్టరుతో ఉన్న వివాదం సమసిపోతే యాదవనగర్ హస్టల్ భవనం ఒక్కటే దళిత సంక్షేమ శాఖ స్వాధీనం చేసుకునే స్థితిలో ఉంది. రెండేళ్లపాటు భవనాల నిర్మాణం పూర్తయినా వాటిని స్వాధీనం చేసుకోవడంలో దళిత సంక్షేమశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబించినట్లు తెలుస్తోంది. కేయూ, ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యాలతో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కనీసం ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి సకాలంలో తీసుకెళ్లలేదు. దీంతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు నిరూపయోగంగా మారాయి. నూతన కలెక్టరేట్ నిర్మాణం దృష్ట్యా కలెక్టరేట్‌లో కొన్ని విభాగాలను సమీప ఆర్ట్స్ కాలేజీలో నిరుపయోగంగా ఉన్న దళిత సంక్షేమ శాఖ హాస్టల్ భవనంలోకి మార్చేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
సామగ్రికి బూజు
జిల్లాలో సుమారు 15వరకు ఎస్సీ కాలేజీ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో మొత్తం మూడు వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ భోజనం వండి పెట్టేందుకు ప్రభుత్వం వంట సామగ్రి కొనుగోలు చేయించింది. లక్షల విలువైన సామగ్రిని నెలలు గడుస్తున్నా అధికారులు హాస్టళ్లకు పంపిణీ చేయలేదు. దీంతో హాస్టల్ వార్డెన్లు, వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా సామగ్రి పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో డీడీ అంకం శంకర్ మాట్లాడుతూ సామగ్రి నాణ్యతను పరిశీలించాల్సి ఉందని.. ఈ మేరకు ఐటీఐ అధికారులను పిలిపించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. పరిశీలన పూర్తికాగానే పంపిణీ చేస్తామని చెప్పారు.