
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లను నియమించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, శాతవాహన యూని వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, మహత్మాగాంధీ యూనివర్సిటీల్లో ఒక్కో యూనివర్సిటీకి ఒక సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు. ముగ్గురు సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని సెర్చ్ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ నామినీగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను నియమించింది.
ఆయా యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్(ఈసీ) నామినీలను, యూజీసీ నామినీలను కమిటీల్లో సభ్యులుగా నియమిం చింది. ఇప్పటికే యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం, ఆ దరఖాస్తులను పరిశీలించి ప్రతి వర్సిటీకి ముగ్గురి పేర్లను సిఫారసు చేసేందుకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి వర్సిటీకి కమిటీలు తమ నివేదికలో ఇచ్చే ముగ్గురి పేర్లలో ఒక్కరిని చాన్స్‌లర్ అయిన గవర్నర్.. వీసీలను నియమిస్తారని వెల్లడించింది. ప్రభుత్వ నామినీగా వ్యవహరించే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సెర్చ్ కమిటీల సమావేశాలను నిర్వహిస్తారని ఉత్వర్వుల్లో పేర్కొంది. వీలైనంత త్వరగా సెర్చ్ కమిటీలు సమావేశమై ప్రతి వర్సిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తుల్లో ముగ్గురి పేర్లను సిఫారసు చేయాలని స్పష్టం చేసింది.